Pawan Appears Before Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు పవన్.. కీలక ఆదేశాలిచ్చిన న్యాయస్థానం
కీలక ఆదేశాలిచ్చిన న్యాయస్థానం
Pawan Appears Before Delhi High Court: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా ఈ-కామర్స్ వేదికల ద్వారా తనపై జరుగుతున్న అనుచిత ప్రచారం వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే కంటెంట్‌ను తొలగించాలని పవన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
పవన్ కళ్యాణ్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుచిత కంటెంట్ ఉన్న లింక్‌లను 7 రోజుల్లోపు తొలగించాలని కోర్టు సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. పవన్ కల్యాణ్ తరపు న్యాయవాది తాను తొలగించాలని కోరుకుంటున్న యూఆర్‌ఎల్‌లను 48 గంటల్లోపు సోషల్ మీడియా సంస్థలకు అందించాలని కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేసింది.
గతంలో ఆశ్రయించిన ప్రముఖులు:
వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించే ఇలాంటి అంశంపై గతంలో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో తెలుగు నటుడు నాగార్జున, బాలీవుడ్ నటులు ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్, మరియు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వంటివారు ఉన్నారు.