'Peddi' Movie: ‘పెద్ది’ మూవీలో కొత్తగా 6 నిమిషాల పాటు కొత్త సీన్లు !
కొత్త సీన్లు !
'Peddi' Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ సరిగా లేదంటూ ప్రేక్షకుల నుండి వచ్చిన విమర్శలు, అలాగే తన నటనకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కొన్ని కీలక సన్నివేశాలను కత్తిరించడంపై సీనియర్ నటుడు జగపతి బాబు వ్యక్తం చేసిన అసంతృప్తిపై మేకర్స్ స్పందించారు. కథలో స్పష్టత కోసం, ముఖ్యంగా జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఆర్క్‌ను మరింత బలంగా చూపించేందుకు గతంలో తొలగించిన సీన్లను మళ్లీ జోడిస్తామని దర్శకుడు బుచ్చిబాబు ప్రేక్షకులకు హామీ ఇచ్చారు.
సినిమా థియేటర్లలో రెండు వారాల రన్‌ను పూర్తి చేసుకునే వరకు వేచి చూడాలని భావించిన చిత్ర యూనిట్, అందుకు తగ్గట్లుగానే అప్‌డేట్ చేసిన కొత్త వెర్షన్‌ను జూన్ 18 నుండి ప్రదర్శిస్తోంది. జూన్ 3న ప్రీమియర్ షోలతో ప్రారంభమై, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో ఇప్పుడు కొత్తగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల సీన్లను యాడ్ చేశారు. ఈ అదనపు సన్నివేశాలు పాత్రల నేపథ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు, కథా గమనాన్ని సాఫీగా మార్చుతాయని మేకర్స్ భావిస్తున్నారు.
ఇక కలెక్షన్ల విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ చిత్రం ఇప్పటివరకు రూ. 317 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించగా, తెలంగాణలో ఫర్వాలేదనిపించే నంబర్లను నమోదు చేసింది. అయితే నార్త్ అమెరికాలో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేక నిరాశపరిచింది. అయినప్పటికీ, ఇప్పుడు కొత్తగా జోడించిన సీన్లు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, సినిమా రన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగించడంలో సహాయపడతాయని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.