సంప్రదింపుల పేరుతో నిర్మాతలు కాలయాపన చేస్తున్నారు

ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్;

Update: 2025-08-16 09:32 GMT

వేతనాల పెంపు విషయంలో ఫిలిం ఫెడరేషన్‌ చేస్తున్న నిరసన కార్యక్రమాలు 13వ రోజుకు చేరినా నిర్మాతలు ఇంకా సంప్రదింపుల పేరుతో కాలయాపన చేస్తోందని ఫెడరేషన్‌ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల పెంపుకు మేము ఒప్పకోవడంలేని నిర్మాతలు మాత్రం బహిరంగంగా మాట్లాడుతున్నారని కానీ మమ్మల్ని ఎక్కడా మాట్లాడవద్దని ఆంక్షలు విధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరేషన్‌ తరపున మూడు రోజుల నుంచి మేము మీడియా ముందుకు రాలేదని, నిర్మాతల మండలి మాత్రం నిన్న ప్రెస్‌ మీట్‌ పెట్టి మాట్లాడారని అనిల్‌ ఆరోపిస్తున్నారు. గడచిన యాభై సంవత్సరాల నుంచి లేని కండీషన్లను ఇప్పుడు కొత్తగా పెడుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించకుండా డైవర్షన్‌ చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని అనిల్‌ నిర్మాతల మండలిపై మండిపడ్డారు. నిర్మాతలు కూడా కష్టాల్లో ఉన్నారన్న ఉద్దేశంతో మేము కొంత దిగి వస్తామని, చర్చలకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నా నిర్మాతలు ఎవరూ అందుబాటులో ఉండటం లేదన్నారు. సరిగ్గా వేతనాల సమస్య వచ్చే సరికి ఎక్కడా లేని పాయింట్లను మాట్లాడుతుంటారని అనిల్‌ కుమార్‌ చెప్పారు. బ్లాంక్‌ పేపర్‌ కూడా తీసుకు వచ్చి వారికి ఇచ్చి ఎలా రాయాలి అంటే అలా రాసుకోమని చెప్పామని అనిల్ తెలిపారు. మా కష్టానికి ప్రతిఫలాన్ని అడుగుతున్నాం తప్ప నిర్మాతను ఇబ్బంది పెట్టాలని కాదని స్పష్టం చేశారు. గతం గురించి మీరు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుందని, త్వరగా నిర్మాతల మండలి నిర్ణయం ఏంటో చెపితే మా కార్యచరణ మేము ప్రకటిస్తామని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ అంటున్నారు.

Tags:    

Similar News