Vijay Sethupathi Shares Emotional Post: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, డైలాగ్ కింగ్ పూరి జగన్నాథ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి సోమవారంతో 26 ఏళ్లు పూర్తయ్యాయి. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన పూరి, నేటికీ తనదైన మార్కు హీరో పాత్రలతో ట్రెండ్ సెట్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

పూరిది భయం లేని ఆలోచనల కోట

విజయ్ సేతుపతి తన పోస్ట్‌లో పూరి జగన్నాథ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. "చిత్రసీమలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు.. అది ధైర్యం, నమ్మకం, భయం లేని ఆలోచనలతో నిర్మించుకున్న ఒక కోట. మీ అద్భుతమైన ప్రయాణంలో భాగమవ్వడం నాకు దక్కిన గౌరవం" అని పేర్కొన్నారు. నటులను వారి కంఫర్ట్ జోన్ నుండి బయటకు తీసుకువచ్చి, వారిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో పూరి సిద్ధహస్తుడని విజయ్ సేతుపతి కొనియాడారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమా షూటింగ్ స్టిల్స్‌ను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.

విడుదలకు సిద్ధమైన స్లమ్ డాగ్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. పూరి కనెక్ట్స్ పతాకంపై ఈ హై-వోల్టేజ్ డ్రామా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags: