Rajendra Prasad and Murali Mohan: రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్ లకు పద్మశ్రీ
పద్మశ్రీ
Rajendra Prasad and Murali Mohan: తెలుగు సినీ పరిశ్రమకు దశాబ్దాలుగా విశేష సేవలు అందించిన సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్లకు భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేసింది.హాస్యంతో పాటు భావోద్వేగ పాత్రల్లో తనదైన శైలితో ప్రేక్షకుల మనసులు గెలిచిన రాజేంద్ర ప్రసాద్, వందలాది సినిమాల్లో నటించి తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన నటన సహజత్వం, బహుముఖ ప్రతిభకు ఈ గౌరవం ప్రతిఫలంగా నిలిచింది.కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో కళల విభాగంలో వీరిద్దరికీ ఈ అత్యున్నత గౌరవం దక్కింది.
దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో వందలాది సినిమాల్లో తనదైన కామెడీ ,నటనతో అలరించిన రాజేంద్ర ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ కోటాలో ఈ అవార్డు వరించింది. నటుడిగా, నిర్మాతగా , రాజకీయ నాయకుడిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన మురళీ మోహన్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే పద్మశ్రీకి ఎంపికయ్యారు.తెలుగు రాష్ట్రాల నుండి మొత్తం 11 మంది తెలుగు వారికి పద్మ పురస్కారాలు దక్కాయి.ఈ ఏడాది బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్రకు (మరణానంతరం) పద్మ విభూషణ్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి పద్మ భూషణ్ కూడా లభించాయి.