Rajinikanth: రజనీకాంత్ - కమల్ హాసన్ క్రేజీ మూవీ టైటిల్ ఫిక్స్.. వేదికపై తలైవా సంచలన వ్యాఖ్యలు..
వేదికపై తలైవా సంచలన వ్యాఖ్యలు..
Rajinikanth: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాంబినేషన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్‌ను బుధవారం చెన్నైలో వైభవంగా ప్రకటించారు. రజనీకాంత్ కెరీర్‌లో 173వ చిత్రంగా రాబోతున్న ఈ భారీ మూవీకి ధర్మన్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో తలైవా రజనీకాంత్ ప్రస్తుత సమాజ పరిస్థితులపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
మాట్లాడాలంటేనే భయమేస్తోంది: రజనీకాంత్ ఆవేదన
ఈ వేదికపై రజనీకాంత్ మాట్లాడుతూ, వర్తమాన పరిస్థితుల్లో బహిరంగంగా మాట్లాడాలంటేనే భయం వేస్తోందని, తన మాటలను నిరంతరం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "ఇటీవలి కాలంలో స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటేనే సంకోచించాల్సిన పరిస్థితి వచ్చింది. నేను మాట్లాడితే అదో పెద్ద సమస్యగా మారుతోంది. సరే అని మౌనంగా ఉంటే.. ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మాట్లాడితే.. ఈ సమయంలో నీకు ఈ మాటలు అవసరమా? అని అడుగుతున్నారు. అసలు ఏమీ మాట్లాడకుండా ఉండటమే మంచిదని మరికొందరు సలహాలిస్తున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది.. మనల్ని ఇష్టపడని వారికి మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా నచ్చదు" అంటూ రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు.
వేప చెట్టు కింద కలలు కన్నాం: కమల్ హాసన్ ఎమోషనల్
ఈ చిత్రానికి కమల్ హాసన్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా కమల్ హాసన్ తమ పాత రోజులను గుర్తుచేసుకుంటూ సరదా వ్యాఖ్యలు చేశారు. "చాలా ఏళ్ల క్రితం మేమిద్దరం ఏవీఎం స్టూడియోలోని ఒక వేప చెట్టు కింద కూర్చుని పెద్ద కలలు కన్నాం. నేడు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాం. ఈ సినిమా పట్ల రజనీకాంత్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాను కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్నానని ఆ సంతోషంతో అందరికీ ఫోన్లు చేసి మరీ చెబుతున్నారు" అని కమల్ హాసన్ నవ్వుతూ పేర్కొన్నారు.
రజనీకాంత్ లీడ్ రోల్ పోషిస్తుండగా, కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ ధర్మన్ చిత్రంపై అటు రజనీ ఫ్యాన్స్, ఇటు కమల్ ఫ్యాన్స్‌లోనే కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ అంచనాలు నెలకొన్నాయి.