Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అభిమానులను కలవరపెట్టిన వార్తపై పెద్ది చిత్ర బృందం స్పందించింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో చరణ్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

అసలేం జరిగింది?

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సమయంలో సెట్స్‌లో రామ్‌చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం, ఆయనకు చికిత్స చేయించింది. సమాచారం ప్రకారం.. గాయమైన చోట నాలుగు కుట్లు పడినట్లు తెలుస్తోంది.

అభిమానులకు విజ్ఞప్తి..

చరణ్ గాయంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండటంతో పెద్ది టీమ్ స్పష్టతనిచ్చింది. రామ్‌చరణ్ ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనవసరమైన పుకార్లను, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. ఆయన ఇప్పటికే కోలుకుంటున్నారు, అంతా సవ్యంగా ఉంటే శుక్రవారం తిరిగి షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

ఏప్రిల్ 30న పెద్ది సందడి..

ఈ చిత్రంలో రామ్‌చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది. గాయం చిన్నదే కావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.

Tags: