Salman Khan: 'కాలా హిరన్’ సినిమాపై స్టే ఇవ్వాలి..ఢిల్లీ హైకోర్టులో సల్మాన్ ఖాన్ పిటిషన్
ఢిల్లీ హైకోర్టులో సల్మాన్ ఖాన్ పిటిషన్
Salman Khan: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కాలా హిరన్: ది బ్యాటల్ ఆఫ్ లెగసీ' (Kaala Hiran: The Battle of Legacy) విడుదలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత హక్కులకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా.. కేవలం దురుద్దేశపూర్వకంగానే ఈ సినిమాను రూపొందించారంటూ సల్మాన్ ఖాన్ కోర్టు మెట్లు ఎక్కారు.
ప్రస్తుతం హైకోర్టులో ఈ విషయానికి సంబంధించిన కమర్షియల్ సూట్ విచారణ పెండింగ్లో ఉందని.. అది తేలేంత వరకూ ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయకుండా అడ్డుకోవాలని సల్మాన్ ఖాన్ కోరారు. ఈ చిత్ర దర్శకుడు భరత్ శ్రీనేత్, నిర్మాత అమిత్ జానీ, జానీ ఫైర్‌ఫాక్స్ ఫిల్మ్స్, అక్షయ్ పాండే తదితరులు ఈ సినిమాను ప్రచారం చేయడం, పంపిణీ చేయడం, థియేటర్లలో ప్రదర్శించడం లేదా ఓటీటీల్లో స్ట్రీమింగ్ చేయడం వంటివి చేయకుండా నిలుపుదల చేస్తూ తక్షణమే ‘ఇంజంక్షన్ ఆర్డర్’ (స్టే ఆర్డర్) ఇవ్వాలని సల్మాన్ కోర్టును అభ్యర్థించారు.
ఈ సినిమా ప్రచారానికి సంబంధించి మేకర్స్ ఎక్కడా నేరుగా తన పేరును ఉపయోగించకపోయినప్పటికీ.. విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు అన్నీ కూడా తన ఆహార్యాన్ని, హావభావాలను (Look and Mannerisms) పోలి ఉన్నాయని సల్మాన్ ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పోస్టర్లు చూస్తే అభిమానులు, సాధారణ ప్రేక్షకులు సైతం అది తన గురించేనని సులభంగా గుర్తించేలా సినిమా టీమ్ ప్లాన్ చేసిందని సల్మాన్ ఖాన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి దీనిపై ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.