Samantha: ప్రముఖ కథానాయిక సమంత ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్‌కు ఆమె తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సమంత నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ తమిళ వెర్షన్ ‘ఎంగల్ తంగం’ ప్రమోషన్ కార్యక్రమాలు చెన్నైలో ముగిసిన అనంతరం ఆమె సీఎం విజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎంతో ఆత్మీయంగా, చిరస్మరణీయంగా సాగిందని సమంత పీఆర్ టీమ్ వెల్లడించింది.
గతంలో సమంత, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తేరి’, ‘మెర్సల్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్లుగా నిలిచాయి. వెండితెరపై మోస్ట్ పాపులర్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య సుదీర్ఘ వృత్తిపరమైన అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో పాత మిత్రుడు, సహనటుడైన విజయ్‌ను ముఖ్యమంత్రి హోదాలో కలవడంపై సమంత హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ క్షణాలను తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో అఖండ విజయం సాధించినప్పటి నుండి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఎంగల్ తంగం’ చిత్రం రేపు (జూన్ 19న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.