Sampath Nandi: శర్వానంద్ నటనకు ఫిదా అయ్యా : సంపత్ నంది

సంపత్ నంది

Update: 2026-06-19 06:28 GMT

Sampath Nandi: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన ఎమోషనల్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న సమయంలో తనకు ఎదురైన ఒక మధురమైన, భావోద్వేగ అనుభవాన్ని దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ సన్నివేశంలో శర్వానంద్ కనబరిచిన అద్భుతమైన నటనకు తాను ఎంతగానో ముగ్ధుడనయ్యానని, ఆ ప్రభావంతో తాను కనీసం ‘కట్’ చెప్పడం కూడా మర్చిపోయానని ఆయన ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. గత దశాబ్ద కాలంలో శర్వానంద్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ అని ఆయన కొనియాడారు.

ఈ షూటింగ్ అనుభవం గురించి సంపత్ నంది మరింత వివరిస్తూ.. "గత 24 గంటలుగా నా భావోద్వేగాలను అణచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. షూటింగ్‌లో శర్వానంద్ నటన చూసి నేను పూర్తిగా అందులోనే లీనమైపోయాను. సీన్ పూర్తయిన తర్వాత కూడా నేను ‘కట్’ చెప్పాలనే విషయాన్నే మర్చిపోయాను. కేవలం నేనే కాదు, సెట్స్‌లో ఉన్న 200 మందికి పైగా ఉన్న చిత్ర యూనిట్ సభ్యులంతా ఒక్కసారిగా చప్పట్లు కొడుతూ, కళ్లు చెమర్చడంతో తుడుచుకోవడం ప్రారంభించారు. నా సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఇలాంటి ఒక అద్భుతమైన అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారి. నా మాటలు నమ్మండి, గుర్తుపెట్టుకోండి.. రేపు థియేటర్లలో ‘భోగి’ సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా కచ్చితంగా ఇదే విధమైన బలమైన అనుభూతిని పొందుతారు" అని చిత్ర దర్శకుడు పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. 1970ల నాటి కాలంలో మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన కథాంశంతో, అద్భుతమైన భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రం రూపకల్పన పొందుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని, రాబోయే ఆగస్టు 2026లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Tags:    

Similar News