Shock for Ram Charan’s ‘Peddi’ in Telangana High Court: రామ్ చరణ్ పెద్దికి తెలంగాణ హైకోర్టులో షాక్.. టికెట్ ధరల పెంపు పిటిషన్ కొట్టివేత..
టికెట్ ధరల పెంపు పిటిషన్ కొట్టివేత..
Shock for Ram Charan’s ‘Peddi’ in Telangana High Court: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు విడుదలకు ముందే తెలంగాణలో ఒక ఊహించని లీగల్ షాక్ తగిలింది. సినిమా మొదటి వారం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
హోం సెక్రటరీ నుంచి స్పందన లేదు.. అందుకే కోర్టుకు..
భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా వస్తున్న పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి కోరుతూ చిత్ర బృందం మొదట తెలంగాణ హోం సెక్రటరీకి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. విడుదల తేదీ దగ్గర పడుతుండటాన్ని గమనించిన మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధులు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. విచారణ వాయిదా
ఈ అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం చిత్ర బృందానికి ఊరటనిచ్చే ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. టికెట్ల ధరల నియంత్రణ విషయంలో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఉన్న పలు కేసులను, వాటికి సంబంధించిన తీర్పులను ప్రస్తావిస్తూ.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
పిటిషన్ ఉపసంహరించుకున్న మైత్రీ మూవీ మేకర్స్
సినిమా గ్రాండ్ రిలీజ్ జూన్ 4న ఫిక్స్ అయి ఉండగా, కోర్టు విచారణ జూన్ 6న జరగడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చిత్ర నిర్మాణ సంస్థ భావించింది. విడుదలైన రెండు రోజుల తర్వాత విచారణ జరిగి లాభం లేదని గ్రహించిన మైత్రీ మూవీ మేకర్స్ తరఫు న్యాయవాది.. తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఏపీలో గ్రీన్ సిగ్నల్.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ది చిత్రానికి భారీగా మద్దతు ఇచ్చింది. ఏపీలో ప్రత్యేక ప్రదర్శనలు, అలాగే టికెట్ ధరల పెంపునకు అధికారిక అనుమతులు లభించాయి. కానీ తెలంగాణలో మాత్రం పాత ధరలకే సినిమాను ప్రదర్శించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్
తెలంగాణలో టికెట్ రేట్లు పెరగకపోవడం ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అయినప్పటికీ.. భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌కు మొదటి వారం కలెక్షన్ల పరంగా ఇది కొంత మైనస్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితుల మధ్య పెద్ది బాక్సాఫీస్ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలి.