Shock to Rajamouli: రాజమౌళికి షాక్.. వివాదంలో వారణాసి
వివాదంలో వారణాసి
Shock to Rajamouli: ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' టైటిల్ వివాదంలో పడింది. ఈ టైటిల్ తమదేనంటూ రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌కు చెందిన నిర్మాత సి.హెచ్. సుబ్బారెడ్డి ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. తాము 'వాణారాసి' (Vaaranasi) అనే టైటిల్‌ను 2023లోనే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) వద్ద రిజిస్టర్ చేసుకున్నామని, దానిని 2026 వరకు రెన్యూవల్ కూడా చేశామని సుబ్బారెడ్డి చెబుతున్నారు. తమ అనుమతి లేకుండా రాజమౌళి ఆ పేరును (స్పెల్లింగ్‌లో కొద్దిగా తేడా ఉన్నా, ఉచ్చారణ ఒకటే) ఉపయోగించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జోక్యం చేసుకునే అవకాశం ఉంది. టైటిల్ హక్కులు ఎవరికి చెందుతాయో తేల్చడానికి లేదా ఇరుపక్షాలు సామరస్యంగా పరిష్కరించుకునేలా చర్చలు జరిపే అవకాశం ఉంది.
'వారణాసి' టైటిల్ ప్రకటన సందర్భంగా జరిగిన 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌లో రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే వివాదాస్పదంగా మారాయి. ఈవెంట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తిన సమయంలో, రాజమౌళి మాట్లాడుతూ, దేవుళ్లపై తనకు నమ్మకం లేదని, హనుమంతుడి గురించి తన తండ్రి, భార్య చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ రాష్ట్రీయ వానరసేన వంటి సంస్థలు ఆయనపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదులు చేశాయి.