Legendary Director Singeetam Srinivasa Rao: నా 40 ఏళ్ల కల ‘సింగ్ గీతం’.. నాగ్ అశ్విన్ వల్లే సాధ్యమైంది: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు
Legendary Director Singeetam Srinivasa Rao: అద్భుత ప్రయోగాలకు, వెండితెర అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్.. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన నలభై ఏళ్ల కలల ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’ ఇటీవల జూన్ 12న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన సినీ ప్రయాణం, ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.
సుమారు నలభై ఏళ్ల క్రితం వచ్చిన ఆలోచనే ఈ ‘సింగ్ గీతం’ అని ఆయన తెలిపారు. సినిమాలో కేవలం మాటలే కాకుండా, ఆ మాటలనే పాటలుగా మార్చి సరికొత్తగా చెప్పాలనేది తన ఎన్నో ఏళ్ల కోరికని.. అది ఇప్పటికి నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ వినూత్న చిత్రం ప్రేక్షకుల ముందుకు ఇంత అద్భుతంగా రావడానికి ప్రధాన కారణం నాగ్ అశ్విన్ అని, ఈ సినిమా పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుందని సింగీతం కొనియాడారు.
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే, వయసు రీత్యా ఆయన లొకేషన్‌కు వెళ్లడం ఇబ్బంది కాకుండా.. నాగ్ అశ్విన్ సరికొత్త టెక్నాలజీతో అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. సింగీతం తన ఇంటిలోని హోమ్ థియేటర్ నుంచే.. ఆన్‌లైన్ సాంకేతిక సహకారంతో షూటింగ్ లొకేషన్‌లోని ప్రతి దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తూ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సూచనలు ఇచ్చారు. లొకేషన్‌లోని కెమెరాలు, మానిటర్లు అన్నీ ఆయన హోమ్ థియేటర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా.. ఇంట్లో కూర్చునే ఈ వయసులో ఒక సినిమా మొత్తాన్ని డైరెక్ట్ చేసి సింగీతం సరికొత్త రికార్డు సృష్టించారు.
కొత్త ఆలోచనలు, సరికొత్త ప్రయోగాలే తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి మూలమని ఆయన పేర్కొన్నారు. క్లాసిక్ మూవీ ‘మాయాబజార్’ రోజుల్లో అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసినప్పటి నుంచే.. కొత్తదనం కోసం వెతకడం అలవాటని, అదే తనను ఇప్పటికీ ముందుకు నడిపిస్తోందని చెప్పారు. నేటి జనరేషన్-జెడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ‘సింగ్ గీతం’ చిత్రం.. భవిష్యత్తులో మరింత విలువైన చిత్రంగా తెలుగు సినీ చరిత్రలో గుర్తింపు పొందుతుందని లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.