Sobhita Dhulipala: శోభితా ధూళిపాళ ఓపెన్ కామెంట్స్.. ఫ్యామిలీ ప్లానింగ్ పై క్లారిటీ.. ఆ ఆలోచనను ఎందుకు మార్చుకుందంటే?
ఆ ఆలోచనను ఎందుకు మార్చుకుందంటే?
Sobhita Dhulipala: టాలీవుడ్ స్టార్ కపుల్ నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన అనంతరం తొలిసారిగా తన వ్యక్తిగత జీవితం, మాతృత్వంపై శోభిత మనసు విప్పి మాట్లాడారు. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో ఆమె పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
సమయం వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయి..
సొంతంగా ఒక కుటుంబాన్ని నిర్మించుకోవాలనే కోరిక తనకు ఎప్పటినుంచో ఉందని శోభిత స్పష్టం చేశారు. అయితే దాని కోసం ప్రత్యేకంగా ఆందోళన చెందడం లేదని పేర్కొన్నార. "నాకు ఒక అందమైన కుటుంబాన్ని ప్రారంభించాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ దానిపై అతిగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. కొన్ని విషయాలు వాటి సరైన సమయం వచ్చినప్పుడు వాటంతట అవే జరుగుతాయి" అని ఆమె వివరించారు.
"హీరోలతో డేటింగ్ చేయనన్నాను.. కానీ ఆలోచన మారింది!"
గతంలో తాను నటులను ఎప్పటికీ డేట్ చేయను అంటూ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శోభిత ప్రస్తావించారు. అప్పట్లో తన చుట్టూ కనిపించిన పరిస్థితులు, సంఘటనల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చానని, అందుకే అలా మాట్లాడానని చెప్పారు. కానీ జీవితంలో అనుభవాలు పెరిగేకొద్దీ మనుషుల ఆలోచనా ధోరణి మారుతుందని, కాలంతో పాటు మన ఆలోచనలను మార్చుకోవడంలో తప్పులేదని కుండబద్దలు కొట్టారు.
రూమర్స్, విమర్శలపై నిర్మొహమాటంగా..
సోషల్ మీడియా, సమాజంలో తమ వ్యక్తిగత జీవితంపై వచ్చే చర్చలను తాను పెద్దగా పట్టించుకోనని శోభిత స్పష్టం చేశారు. "సమాజం యొక్క అభిప్రాయాలు వాతావరణం లాంటివి.. అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. వాటిని తలకెక్కించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా జీవించడమే ముఖ్యం" అని ఆమె తేల్చి చెప్పారు. రామన్ రాఘవ్ 2.0తో మొదలైన తన సినీ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకున్న వేళ, శోభిత పరిణతితో చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.