Sonu Sood Foundation Gives New Life to Women: సోనూసూద్ ఫౌండేషన్ మహిళలకు కొత్త జీవితం: దేశవ్యాప్తంగా 500కి పైగా ఉచిత రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు

దేశవ్యాప్తంగా 500కి పైగా ఉచిత రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు

Update: 2025-12-17 12:33 GMT

Sonu Sood Foundation Gives New Life to Women: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యంతో అందరి హృదయాలను ఆకర్షించారు. రియల్ లైఫ్ హీరోగా పేరొందిన ఆయన నడిపిస్తున్న సూద్ చారిటీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 500 మందికి పైగా మహిళలకు రొమ్ము క్యాన్సర్ (బ్రెస్ట్ క్యాన్సర్) ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ చొరవతో ఆ మహిళలకు కొత్త జీవితాన్ని అందించినందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

సోనూసూద్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ‘‘సూద్ చారిటీ ఫౌండేషన్ ఆరంభించినప్పుడు నా లక్ష్యం దేశంలోని మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి విముక్తి చేయడమే. చాలామంది మహిళలు ఈ వ్యాధితో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, సిగ్గు లేదా దూరం వల్ల ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారు. మేం దేశవ్యాప్తంగా ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తాం’’ అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు 500కి పైగా శస్త్రచికిత్సలు పూర్తయ్యాయని, ఆ మహిళలు కొత్త జీవితాన్ని పొందారని సోనూసూద్ తెలిపారు. ‘‘వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇది సమష్టి కృషి ఫలితమే. వైద్యులకు కూడా కృతజ్ఞతలు. ఇది కేవలం ప్రారంభమే, భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం’’ అని ఆయన స్పష్టం చేశారు.

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడంతోపాటు, నేరుగా చికిత్స అందించడం ద్వారా ఫౌండేషన్ ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలో ఎక్కడున్నా, ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళలకు పూర్తి ఉచిత చికిత్స బాధ్యత తీసుకుంటామని సోనూసూద్ హామీ ఇచ్చారు.

సోనూసూద్ మంచితనం ఇదే మొదటిసారి కాదు. కరోనా కాలంలో వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చడం, అనేక మందికి వైద్య సాయం అందించడం ద్వారా ఆయన రియల్ హీరోగా మారారు. సినిమాల్లో విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సోనూసూద్, వాస్తవ జీవితంలో మాత్రం హీరోగా నిలుస్తూనే ఉన్నారు. ఆయన చొరవకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News