‘Srinivasa Mangapuram’: శ్రీనివాస మంగాపురం సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌.. 30న విడుదలకు సిద్దం..

30న విడుదలకు సిద్దం..

Update: 2026-07-24 08:57 GMT

‘Srinivasa Mangapuram’: సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు కుటుంబం నుండి మరో కొత్త వారసుడు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. మహేశ్ బాబు సోదరుడు దివంగత రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి U/A సర్టిఫికెట్ పొందింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రేమకావ్యం జులై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్టార్ వారసుల ఎంట్రీ:

ఘట్టమనేని కుటుంబం నుండి జయకృష్ణ ఎంట్రీ ఇస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతోంది. తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో వాసుబాబు, మంగా అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ప్రేమికులుగా మారిన తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే అనూహ్య పరిణామాలే ప్రధానాంశం. ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండడం విశేషం.

క్రేజీ కాంబినేషన్ - భారీ అంచనాలు:

ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి విలక్షణమైన హిట్ చిత్రాలను అందించిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో చంద్రమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో ఈ ఘట్టమనేని వారసుడి బోణీ ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News