SS Rajamouli: ఫ్రాన్స్‌లో ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం!
అరుదైన గౌరవం!
SS Rajamouli: తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన మన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి.. విశ్వ వేదికపై మరో అరుదైన, అపురూపమైన గౌరవాన్ని దక్కించుకున్నారు. సినిమాను కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్ జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘లూమియర్ మ్యూజియం’లో జక్కన్న పేరు ఇకపై చిరస్థాయిగా నిలిచిపోనుంది!
తాజాగా లూమియర్ మ్యూజియంతో పాటు, తన సంచలన చిత్రాలు ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’లను ప్రదర్శించిన స్క్రీనింగ్ రూమ్‌ని సందర్శించారు రాజమౌళి. ఈ సందర్భంగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా మన జక్కన్నని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అంతటితో ఆగకుండా, ఆ తర్వాత రాజమౌళికి ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో లాంటి వరల్డ్ క్లాస్ లెజెండరీ డైరెక్టర్ల నేమ్ బోర్డులు ఉండే ప్రతిష్ఠాత్మక ‘మ్యూర్ డే సినియాస్ట్’.. అంటే ఫిల్మ్ మేకర్స్ వాల్ వద్దకు రాజమౌళిని తీసుకెళ్లారు. అక్కడ ఎర్రటి వస్త్రంతో కప్పి ఉన్న ఫలకాన్ని ఓపెన్ చేయగానే.. ప్రపంచ సినిమా దిగ్గజాల పక్కన "ఎస్ ఎస్ రాజమౌళి" అనే పేరు సగర్వంగా మెరిసిపోయింది!
ఈ చారిత్రక క్షణాన్ని చూసి రాజమౌళి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని, ఈ గౌరవాన్ని ఎప్పటికీ మరువలేనని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. సినిమా చరిత్రకే ఒక పవిత్ర స్థలం లాంటి ఆ గోడపై.. హాలీవుడ్ క్లాసిక్ లెజెండ్స్ సరసన మన రాజమౌళి పేరు శాశ్వతంగా నిలిచిపోవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే ఒక గర్వకారణమైన క్షణం.