Producer Vishwaprasad: ఆ 3 సినిమాల వల్ల భారీగా నష్టపోయాను - నిర్మాత విశ్వప్రసాద్

నిర్మాత విశ్వప్రసాద్

Update: 2025-09-03 09:28 GMT

Producer Vishwaprasad: టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన టి.జి. విశ్వప్రసాద్ తమ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు భారీ నష్టాలను మిగిల్చాయని వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. "నేను సాఫ్ట్‌వేర్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చాను. నా తండ్రి లేదా తాతల నుంచి వారసత్వంగా ఆస్తులు ఏమీ రాలేదు. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే సినిమాలు నిర్మిస్తున్నాను. అయితే గత ఏడాది నాకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. నేను నిర్మించిన మూడు సినిమాలు ఈగల్, మిస్టర్ బచ్చన్, స్వాగ్ పరాజయం పాలయ్యాయి’’ అని విశ్వప్రసాద్ తెలిపారు.

భారీ నష్టాలు, అయినా నమ్మకంతో ముందడుగు

రవితేజ హీరోగా నిర్మించిన ఈగల్ సినిమా వల్ల భారీగా నష్టపోయానని, అలాగే 'మిస్టర్ బచ్చన్' సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశించినా, కొన్ని కారణాల వల్ల అది నిరాశపరిచిందని ఆయన పేర్కొన్నారు. ఇక శ్రీవిష్ణు హీరోగా రూపొందించిన స్వాగ్ చిత్రం కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టిందని, ఒకే సంవత్సరంలో మూడు సినిమాల నష్టాలను భరించడం చాలా కష్టమని ఆయన అన్నారు.

మిరాయ్'పై భారీ అంచనాలు

అయితే ఈ నష్టాల నుంచి కోలుకుంటామని.. తమ తదుపరి చిత్రం మిరాయ్ భారీ విజయాన్ని సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని, ఇది తమ బ్యానర్‌కు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత తమ నష్టాలను బహిరంగంగా వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News