సూపర్ ఫాస్ట్ డైరెక్టర్...అనిల్ రావిపూడి

Super Fast Director...Anil Ravipudi;

Update: 2025-06-20 06:10 GMT

తెలుగు సినిమాల్లో హిట్ మేకర్ అని మరోసారి చూపించాడు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ. 300 కోట్లు కొల్లగొట్టి, 92 సెంటర్లలో 50 రోజులు ఆడించాడు. ఈ హిట్ తర్వాత ఆగకుండా, మెగాస్టార్ చిరంజీవితో మెగా157 (#Mega157) సినిమా మీద పడ్డాడు. ఒక సినిమా హిట్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్‌కి మారిన అతని స్పీడు, పట్టుదల చూస్తే అబ్బురమే!

ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2026 సంక్రాంతికి రాబోతోంది.ఫిబ్రవరిలో చిరుకి కథ చెప్పాడు

ఫిబ్రవరి చివర్లో అనిల్ మెగా157 కథను పూర్తి చేసి, చిరంజీవికి చెప్పాడు. చిరు నిజ జీవితంలోని పేరు శివ శంకర్ వరప్రసాద్ పేరుతో ఉన్న ఈ పాత్ర చిరుకి బాగా నచ్చింది. అనిల్ చెప్పిన కథలో కామెడీ, ఎమోషన్, మాస్ టచ్‌లు చిరుని ఆకట్టుకున్నాయి. తొలిసారి అనిల్‌తో కలిసి పనిచేస్తున్న చిరు, కథ విన్నాక ఫుల్ జోష్‌లో ఉన్నారట. ఈ సినిమా మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని అందరూ ఆశిస్తున్నారు.

మార్చిలో ఘనంగా పూజ కార్యక్రమం

మార్చి 30న ఉగాది రోజున మెగా157 సినిమాని గ్రాండ్‌గా పూజ చేసి మొదలెట్టారు. వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, కె. రాఘవేందర్ రావు లాంటి పెద్దలు ఈ వేడుకకి వచ్చారు. వెంకటేష్ క్లాప్ కొట్టగా, రాఘవేందర్ రావు తొలి సీన్ తీశారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా భారీగా తెరకెక్కుతోంది. అనిల్ తన టీమ్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియోతో అప్పుడే సినిమాకి హైప్ తెచ్చాడు.

మేలో షూటింగ్, జూన్‌కి రెండు షెడ్యూళ్లు పూర్తి

మే 22 నుంచి హైదరాబాద్‌లో మెగా157 షూటింగ్ స్టార్ట్ అయింది. చిరంజీవితో కీలక సన్నివేశాలు తీశారు. తొలి షెడ్యూల్‌లో చిరు 90లు, 2000లలోని కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. జూన్‌లో ముస్సూరీలో రెండో షెడ్యూల్ పూర్తయింది. చిరు, నయనతార, వీటీవీ గణేష్‌లతో ఫన్నీ సీన్లు తీశారు. చిరుతో నయనతార మూడోసారి జతకడుతోంది. అనిల్ రవిపూడి స్పీడ్‌గా షూటింగ్ చేసి, రెండు షెడ్యూళ్లు పూర్తి చేశాడు. 2026 సంక్రాంతికి సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంటుంది.

Tags:    

Similar News