Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త!

రజనీకాంత్ అభిమానులకు శుభవార్త!

Update: 2025-12-09 12:02 GMT

Superstar Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త! ఇండియన్ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన ఐకానిక్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'పడయప్ప' (తెలుగులో 'నరసింహ') సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ ప్రకటించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం 4K ఫార్మాట్‌లో రీ-రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, 'ది రిటర్న్ ఆఫ్ పడయప్ప' పేరిట విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు.

'2.0', 'జైలర్ 2' వంటి చిత్రాలకు సీక్వెల్స్ వస్తున్నప్పుడు, 'పడయప్ప 2' ఎందుకు తీయకూడదు అని తనకు అనిపించిందని రజనీకాంత్ తెలిపారు. దీనికి 'నీలాంబరి: పడయప్ప 2' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కథా చర్చలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని, అంతా అనుకున్నట్లు జరిగితే, అభిమానులకు మరోసారి పండుగ వాతావరణం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తొలి భాగంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పే డైలాగ్‌ను దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్ కథ ఆ పాత్ర చుట్టూ కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

1999లో విడుదలైన 'నరసింహ' సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన దురహంకారంతో కూడిన విలన్ పాత్ర 'నీలాంబరి' తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. కాగా, ఈ ఒరిజినల్ చిత్రానికి కథ, నిర్మాత కూడా తానేనని రజనీకాంత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే, సినిమాకు 'పడయప్ప' అనే టైటిల్ పెట్టింది కూడా తానేనని, మొదట్లో దర్శకుడు కె.ఎస్. రవికుమార్ అంగీకరించకపోయినా, ఆ టైటిల్‌లో ఉన్న వైబ్రేషన్ గురించి చెప్పి ఒప్పించానని నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

'నరసింహ' సీక్వెల్ ప్రకటనతో రజనీకాంత్ అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సీక్వెల్ కోసం చర్చలు జరుగుతున్నట్లు మాత్రమే రజనీకాంత్ వెల్లడించగా, దర్శకుడు లేదా ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. రజనీకాంత్ 75వ పుట్టినరోజు కానుకగా ఆయన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ 'నరసింహ' (పడయప్ప) 4K క్వాలిటీతో డిసెంబర్ 12న థియేటర్లలోకి రాబోతోంది. సీక్వెల్ వార్తతో అభిమానులకు ఇది మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.

Tags:    

Similar News