డ్రగ్స్ తీసుకుంటే ఇకనుంచి బహిష్కరణే - దిల్ రాజు
డ్రగ్స్ వాడితే సినీ పరిశ్రమ నుంచి బహిష్కరణ తప్పదని హెచ్చరిస్తూ ప్రముఖ నిర్మాత, టీఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ రహితంగా ఉండాలని, ఇందుకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం సమాజంపై చెడు ప్రభావం చూపుతుంది కాబట్టి దీనిని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలోని పెద్దలతో చర్చించి, తగిన నిబంధనలను అమలు చేస్తామని దిల్ రాజు ప్రకటించారు. మళయాల చిత్ర పరిశ్రమ ఇటీవల డ్రగ్స్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకుందని, డ్రగ్స్ వాడిన వారిని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించే నిబంధనను అమలు చేస్తోందని చెపుతూ ఈ నిర్ణయాన్ని దిల్ రాజు అభినందించారు. తెలుగు సినిమా పరిశ్రమ కూడా ఇదే దిశలో అడుగులు వేయాలని పేర్కొన్నారు. మలయాళం పరిశ్రమ ఈ చర్య ద్వారా సమాజానికి బలమైన సందేశం ఇచ్చిందని, తెలుగు పరిశ్రమ కూడా ఇలాంటి కఠిన చర్యలతో డ్రగ్స్‌ను నిరోధించాలని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ద్వారా చర్చలు జరిపి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉంది. ఈ లక్ష్యంతో రాష్ట్రంలో అవగాహన కార్యక్రమాలు, కఠిన చర్యలు చేపడుతోంది. ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా భాగస్వాములవుతూ, యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి నటులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని, యువతను స్ఫూర్తిపరిచే సందేశాలు ఇచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, సినీ పరిశ్రమ, పోలీసు శాఖ కలిసి పనిచేస్తున్నాయి. దిల్ రాజు ఈ సందర్భంగా, సినీ పరిశ్రమ బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.