Actress Meera Mithun Arrested: నటి మీరా మిథున్ అరెస్టు
మీరా మిథున్ అరెస్టు;
Actress Meera Mithun Arrested: నటి మీరా మిథున్‌ను దిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. 2021లో మీరా మిథున్ దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగల ప్రజలను కించపరిచారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె, ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌పై కేసు నమోదైంది. 2021లో అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన తర్వాత, ఆమె కోర్టు విచారణలకు హాజరు కాలేదు. దీంతో 2022లో ఆమెపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మూడేళ్లుగా మీరా మిథున్ పరారీలో ఉండగా, ఇటీవల ఆమె తల్లి ఢిల్లీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెను గుర్తించి ఒక హోమ్‌కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చెన్నై కోర్టు, ఆమెను అరెస్టు చేసి ఆగస్టు 11న కోర్టులో హాజరుపరచాలని చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆదేశించింది. 2021 ఆగస్టులో మీరా మిథున్ తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో తీవ్ర దుమారాన్ని రేపింది. అందులో ఆమె ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వ్యక్తులపై కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు దర్శకులు తన ఫోటోను అనుమతి లేకుండా వాడారని ఆరోపిస్తూ, కోలీవుడ్ నుంచి షెడ్యూల్డ్ కులాలవారిని తొలగించాలంటూ ఆమె చెప్పిన మాటలు తీవ్ర అభ్యంతరకరంగా మారాయి. ఈ వీడియో ఆధారంగా విదుతలై సిరుతైగళ్ పార్టీ నేత వన్నీ అరసు ఫిర్యాదు చేయగా, మీరా మిథున్ పై IPC సెక్షన్లు 153, 153A(1)(a), 505(1)(b), 505(2) తో పాటు SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అప్పట్లో మీరాతో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్ అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.