Thalapathy Vijay's 'Jananayagan': దళపతి విజయ్ జననాయగన్ రిలీజ్ డేట్ ఫిక్స్..?
రిలీజ్ డేట్ ఫిక్స్..?
Thalapathy Vijay's 'Jananayagan': కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ సినీ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కిన జననాయగన్ విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం, ఈ హై-వోల్టేజ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర యూనిట్ గట్టిగా సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ విడుదల పూర్తిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇచ్చే క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
జూన్ 19న సెన్సార్ డెసిషన్.. నిర్మాతల భారీ స్కెచ్..
జూన్ 19 నాటికి సెన్సార్ బోర్డు నుండి తుది అనుమతి వస్తుందని చిత్రబృందం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఒకవేళ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే, జూన్ 26న సినిమా రిలీజ్ కావడం పక్కా. అయితే, ఒకవేళ అనుకోని కారణాల వల్ల జూన్ 22 నాటికి కూడా సెన్సార్ అనుమతులు లభించకపోతే.. ఈ సినిమాను మరింత కాలం హోల్డ్‌లో పెట్టకుండా డిస్ట్రిబ్యూటర్ల నుండి తీసుకున్న అడ్వాన్స్ అమౌంట్‌ను తిరిగి ఇచ్చేయాలని నిర్మాతలు ఒక సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్. ఒకవేళ అదే పరిస్థితి వస్తే, డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు సీఎం విజయ్ సైతం తన పారితోషికాన్ని వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించినట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో వినపడుతోంది.
ల్యాబ్ నుండి సుప్రీంకోర్టు వరకు.. జననాయగన్ వివాదాల ప్రస్థానం..
టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆది నుండి అడ్డంకులే ఎదురయ్యాయి. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9నే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. 2025 డిసెంబర్‌లో సెన్సార్‌కు వెళ్లినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి. సినిమాపై వచ్చిన పలు పొలిటికల్ ఫిర్యాదులు, రివైజింగ్ కమిటీ రివ్యూలు, మద్రాస్ హైకోర్టుతో పాటు ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన న్యాయపోరాటాల వల్ల సినిమా ల్యాబ్‌కే పరిమితమైంది. వీటన్నింటికీ తోడు గత ఏప్రిల్ నెలలో ఈ సినిమా నెట్టింట లీక్ అవ్వడం చిత్ర యూనిట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. ఇన్ని కష్టాలను దాటుకుని ఇప్పుడు థియేటర్ల వైపు అడుగులు వేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ సరసన పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా మెరిశారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. సీఎం హోదాలో విజయ్ నెక్స్ట్ లెవెల్ పబ్లిసిటీతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.