Telugu Film Industry : కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె..

పరిస్ధితులు చక్కదిద్దడానికి ఫెడరేషన్‌ నాయకులతో భేటీ అయిన చిరంజీవి..;

Update: 2025-08-19 03:35 GMT

వేతనాలు పెంచాలంటూ గత కొద్ది రోజులుగా తెలుగు సినీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని మూవీ షూటింగ్స్‌ నిలిచిపోయాయి. రూ.2 వేలలోపు జీతాలున్న వారికి పర్సంటేజీల ప్రకారం వేతనాలు పెంచుతామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే, వారు పెట్టిన షరతులు ఒప్పుకోవాల్సిందేనని నిర్మాతలు షరతులు పెడుతున్నారు. ఇందుకు కార్మికులు విముఖత వ్యక్తం చేస్తుండటంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలో అగ్ర కథానాయకుడు చిరంజీవి రంగంలోకి దిగారు. ఫెడరేషన్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రతి యూనియన్‌తో విడివిడిగా మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. నేడు మంగళవారం సాయంత్రం 4గంటలకు ఫెడరేషన్‌తో ఫిలిం ఛాంబర్‌ సమావేశం కానుంది.

ఈ క్రమంలో చిరంజీవితో సమావేశం అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌ విలేకరులతో మాట్లాడారు. ''కార్మిక వేతనాలు పెంచాలని కోరుతూ గత 15 రోజులుగా మేం సమ్మె చేస్తున్నాం. ఈ రోజు అగ్ర కథానాయకుడు చిరంజీవి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడారు. 24 విభాగాల నుంచి 72 మందితో చర్చించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చాం. సాధ్యం కాని, అమలు చేయలేని నిబంధనలు పెడుతున్నారని తెలిపాం. ఏదేమైనా మా కార్మికులతో పాటు, నిర్మాతలూ బాగుండాలని, నిర్మాతలు చెప్పిన ఆ రెండు షరతులు ఒప్పుకొంటే తామే నష్టపోతామని చిరంజీవి గారికి వివరించాం. అలాగే, ఆదివారం డబుల్ కాల్ షీట్ గురించి కూడా విన్నవించాం. 'మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరకు రండి అని చిరంజీవి భరోసా ఇచ్చారు. అందరి సమస్యలు సానుకూలంగా విన్నారు. మంగళవారం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఛాంబర్ నుంచి కూడా మాకు పిలుపు వచ్చింది. చర్చలకు పిలిచారు కాబట్టి, మేము నిరసన కార్యక్రమం ప్రస్తుతానికి ఆపేశాం. మేం అడిగినట్లు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం అని అన్నారు.

ఫిల్మ్‌ ఫెడరేషన్‌, ఫిలిం ఛాంబర్‌ మధ్య చర్చలు జరగాల్సి ఉన్నా, నిర్మాతలు అందుబాటులో లేకపోవడం వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి స్వయంగా ఫెడరేషన్‌ నాయకులతో చర్చించడం గమనార్హం. సినిమా షూటింగ్‌లు రోజుల కొద్దీ నిలిచిపోవడం పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకు వచ్చి, విడుదల తేదీ కూడా ప్రకటించిన సినిమాలు ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా పడనుంది. ఈ జాబితాలో చిరంజీవి సినిమానే కాదు, ఇతర నటీనటుల సినిమాలు కూడా ఉన్నాయి.

Tags:    

Similar News