Naga Chaitanya: ఈ ప్రాజెక్ట్ అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య
నాగచైతన్య
Naga Chaitanya: అక్కినేని యువ హీరో నాగచైతన్య ‘దూత’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు, దాదాపు మూడేళ్ల తర్వాత ఈ బ్లాక్‌బస్టర్ సిరీస్‌కు కొనసాగింపుగా ‘దూత 2’ పట్టాలెక్కింది. ఇటీవల ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
అయితే ఈ ‘దూత 2’తో నాగచైతన్య సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నారు. ఈసారి ఆయన కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ గురించి చైతూ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఇందులో కేవలం నటనకే పరిమితం కాకుండా, దానికి మించి ఏదైనా చేయాలనిపించి నిర్మాతగా మారినట్లు వెల్లడించారు. ఏదైనా పనిలో పూర్తిగా లీనమైనప్పుడు, దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తామని.. ఆ అభిరుచే తనను ఈ నిర్ణయం వైపు నడిపించిందని చెప్పారు.
దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాత శరత్ మారర్‌లతో తనకు ఉన్న మంచి అనుబంధం వల్లే ఇది సాధ్యమైందని చైతన్య స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, ‘దూత 2’కు సంబంధించి సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌లో సీనియర్ బ్యూటిఫుల్ నటి భూమిక చావ్లా ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. గతంలో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాలో భూమిక ఆయనకు అక్కగా నటించి మెప్పించారు.
ఒకవేళ ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు గనుక నిజమైతే.. నాగచైతన్య, భూమిక కాంబినేషన్‌లో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. దూత సీజన్-1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ దృష్ట్యా.. పార్ట్-2 లో భూమిక ఎంట్రీ ఇస్తే సిరీస్‌కు మరింత వెయిట్ పెరుగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.