Ticket Prices for ‘Peddi’ Increased in Telangana: తెలంగాణలో పెద్ది సినిమా టికెట్ల ధరల పెంపు.. పూర్తి వివరాలు ఇవే
పూర్తి వివరాలు ఇవే
Ticket Prices for ‘Peddi’ Increased in Telangana: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో థియేటర్ల దగ్గర మెగా జాతర మొదలైనట్లయింది.
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. పెద్ది సినిమా టికెట్ ధరల పెంపునకు భారీగా ఊరట లభించింది. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రతి టికెట్ పైన రూ. 100, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్రతి టికెట్ పైన రూ. 125 చొప్పున అదనంగా పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పెంపుదల సినిమా విడుదలైన రోజు నుంచి వరుసగా 10 రోజుల పాటు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక అంతకంటే పెద్ద విశేషం ఏంటంటే.. జూన్ 3వ తేదీ రాత్రి ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను ఏకంగా రూ. 600 గా నిర్ణయించుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. రేపు ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండటంతో.. ఈ రోజు రాత్రి నుంచే థియేటర్లలో ‘పెద్ది’ హంగామా షురూ కానుంది. బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థనను మన్నించి.. చిత్ర పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ టికెట్ రేట్ల పెంపుతో మొదటి వారంలోనే 'పెద్ది' సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.