Tollywood Issues Reach Pawan Kalyan’s Doorstep: తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్ర నష్టాల్లో నడుస్తున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కు వివరించారు. మల్టీప్లెక్స్ తరహాలోనే.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా వచ్చే లాభాల నుండి నిర్మాతలకు కొంత పర్సంటేజీ (వాటా) ఇచ్చేలా ఒక నిర్దిష్టమైన పాలసీని తీసుకురావాలని కోరారు. దీనివల్ల నష్టాల్లో ఉన్న థియేటర్లు మళ్లీ నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ పరంగా చొరవ చూపి, ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు.

రాజమహేంద్రవరంలో డిప్యూటీ సీఎం పవన్‌తో.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు మైత్రీ రవిశంకర్, సితార నాగవంశీ, సాహు గారపాటి, సతీష్ తదితరులు(మే26న) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం చిత్ర పరిశ్రమ, ముఖ్యంగా థియేటర్ల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. గత కొంతకాలంగా థియేటర్ల నిర్వహణ వ్యయం (మెయింటెనెన్స్) భారీగా పెరిగిపోయిందని, నెలవారీ ఖర్చులు భారం కావడంతో ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారని నిర్మాతలు పవన్‌కు వివరించారు. థియేటర్లకు విద్యుత్ ఛార్జీల్లో కొంత రాయితీ ఇస్తే.. యాజమాన్యాలపై భారం తగ్గుతుందని గుర్తుచేశారు.

నిర్మాతలు చెప్పిన సమస్యలపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం తప్పకుండా అడుగులు వేస్తుందని అభయమిచ్చారు. అంతేకాదు.. నిర్మాతలు చేసిన ఈ ప్రతిపాదనలను, సమస్యలను తక్షణమే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Tags: