‘Toxic’ Team Breaks Silence: ‘టాక్సిక్’ రీషూట్ రూమర్లపై చిత్ర యూనిట్ క్లారిటీ!
రూమర్లపై చిత్ర యూనిట్ క్లారిటీ!
‘Toxic’ Team Breaks Silence: “కె.జి.యఫ్ 2” భారీ విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న తదుపరి చిత్రం టాక్సిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోనే పలు ఆలస్యాలను ఎదుర్కొంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడటంతో అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో ఒక సరికొత్త రూమర్ జోరుగా చక్కర్లు కొట్టింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన కొన్ని కీలక సన్నివేశాల అవుట్‌పుట్ పట్ల హీరో యశ్ సంతృప్తిగా లేరని, అందుకే ఏకంగా 100 రోజుల పాటు భారీగా రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఈ ప్రచారం సారాంశం. అంతేకాకుండా, ఈ రీషూట్ కారణంగా సినిమా చిత్రీకరణ మరికొన్ని నెలల పాటు సాగుతుందని, తద్వారా సినిమా విడుదల 2027కి నెట్టబడుతుందనే వార్తలు నెటిజన్లను ఆందోళనకు గురిచేశాయి.
ఆ రూమర్స్ పూర్తిగా అబద్ధం: చిత్రబృందం
ఈ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘టాక్సిక్’ చిత్ర యూనిట్ వెంటనే స్పందించి ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఈ రీషూట్ రూమర్లలో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లేనని స్పష్టం చేసింది. సినిమా అవుట్‌పుట్ పట్ల టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉందని, త్వరలోనే సినిమాకు సంబంధించిన సరికొత్త అధికారిక విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.
భారీ తారాగణంతో ‘టాక్సిక్’..
గోవా నేపధ్యంలో సాగే పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో యశ్ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో సౌత్ టూ నార్త్ భారీ తారాగణం నటిస్తోంది. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా ఖురేషి మరియు రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.