Rasha Thadani: తెలుగు సినిమాల్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తావ్.. అమ్మ మాటలతో టాలీవుడ్‌లోకి రషా థడానీ
టాలీవుడ్‌లోకి రషా థడానీ
Rasha Thadani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా థడానీ 'శ్రీనివాస మంగాపురం' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా, అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తన టాలీవుడ్ ఎంట్రీ, తల్లిదండ్రుల అభిప్రాయాల గురించి రషా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అమ్మ రవీనా టాండన్ చెప్పిన సీక్రెట్ టిప్!
తెలుగు సినిమాల్లో నటించడం గురించి అమ్మ రవీనా టాండన్ ఏమైనా యాక్టింగ్ టిప్స్ ఇచ్చారా అని అడిగితే.. రషా చాలా సరదాగా స్పందించారు. "అమ్మ నాకు ప్రత్యేకంగా నటనా పాఠాలేమీ చెప్పలేదు. కానీ 'తెలుగు సినీ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావ్, అక్కడ వర్క్ వాతావరణం చాలా బాగుంటుంది' అని చెప్పింది. అలాగే టాలీవుడ్‌లో లాంగ్ రన్ ఉండాలంటే తెలుగు భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యమని సలహా ఇచ్చింది. అమ్మ చెప్పినట్టే నేను ప్రస్తుతం తెలుగు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాను" అని రషా తెలిపారు. విశేషమేమిటంటే.. ఒకప్పుడు రవీనా టాండన్ ఏ పద్మాలయా స్టూడియోస్‌లోనైతే షూటింగ్ చేశారో, అదే పద్మాలయా స్టూడియోస్‌లో రషా కూడా తన డెబ్యూ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం!
హైదరాబాద్ అంటే నాన్నకు ఎంతో ఇష్టం
ఇక తన టాలీవుడ్ డెబ్యూ గురించి నాన్న (అనిల్ థడానీ) స్పందన తెలుపుతూ.."నాన్నకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. నిజానికి ఆయనకు హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలని కూడా ఒకప్పుడు కోరిక ఉండేది. నేను తిరుపతిలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాన్నకు ఫోన్ చేస్తే.. 'నేను నా హోమ్‌టౌన్ హైదరాబాద్‌కు వస్తున్నాను' అని సరదాగా అన్నారు. నా కంటే ఎక్కువగా నా టాలీవుడ్ ఎంట్రీతో నాన్నే చాలా ఎగ్జైట్‌గా ఉన్నారు" అని చెప్పుకొచ్చారు.
డైరెక్టర్ అజయ్ భూపతి 'మంగా' క్యారెక్టర్'
ఆర్‌ఎక్స్ 100' వంటి సంచలన చిత్రాన్ని తీసిన అజయ్ భూపతి దర్శకత్వంలో చేయడంపై రషా స్పందిస్తూ.. "అజయ్ సార్ సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టర్లు చాలా బబ్లీగా, ఎనర్జిటిక్‌గా ఉంటాయి. 'శ్రీనివాస మంగాపురం'లో నేను చేస్తున్న 'మంగా' క్యారెక్టర్ రియల్ లైఫ్‌లో నేను ఎలా ఉంటానో దాదాపు అలాగే ఉంటుంది. కొన్నిసార్లు అజయ్ సార్ షూటింగ్‌లో 'యాక్టింగ్ చేయొద్దు.. నీలా సహజంగా ఉండు చాలు' అని చెప్పేవారు. అందుకే ఈ క్యారెక్టర్ నా మనసుకి చాలా దగ్గరైంది అని రషా వివరించారు.