Aadi Krithika Festival: శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
ఆడికృత్తిక మహోత్సవం
Aadi Krithika Festival: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం ఆడికృత్తిక పర్వదినం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం
ఉదయం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా విశేష అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు.
సాయంత్రం తిరువీధుల్లో స్వామివారి దివ్య విహారం
సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ తిరువీధి ఉత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందారు.