AMARNATH TEMPLE : ప్రమాదానికి గురైన అమరనాథ్ యాత్ర బస్సులకు
36 మంది భక్తులకు గాయాలు;
జమ్మూ కాశ్మీర్ లో మూడు రోజుల క్రితం ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అమరనాధ్ యాత్రకు వెళ్ళే దారిలోని చందర్ కోట్ సమాపంలో జరిగిన బస్సుల ప్రమాదంలో పలువురు అమరనాథ్ యాత్రికులు గాయపడ్డారు. రాంబన్ నుంచి పహల్గామ్ వెళ్ళే దారిలో ఐదు ట్రావెట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 36 మంది భక్తులు గాయపడ్డట్లు జమ్మూకాశ్మీర్ అదికార వర్గాలు తెలిపాయి. ఒక కాన్వాయిలా వెళుతున్న ఈ ఐదుబస్సుల్లో ఒక దానికి బ్రేక్ ఫెయిలవ్వడంతో నియంత్రణ కోల్పోయి ఒకదానిని ఒకటి ఢీకొన్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను రాంబన్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈనెల 3వ తేదీన ప్రారంభమైన అమరనాథ్ యాత్ర వచ్చే ఆగస్టు 9వ తేదీ వరకూ 38 రోజుల పాటు కొనసాగుతుంది. గడచిన రెండు రోజుల్లో 27వేల మంది భక్తులు అమరనాథ్ ని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.