Garuda Purana Be Read at Home: హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన 18 మహాపురాణాల్లో గరుడ పురాణం ఒకటి. సాధారణంగా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే గరుడ పురాణాన్ని పఠించడం లేదా పండితులతో చదివించడం మనకు కనిపిస్తుంది. దీంతో ఈ గ్రంథాన్ని సాధారణ రోజుల్లో ఇంట్లో చదవకూడదని, ఇంట్లో పెట్టుకుంటే అరిష్టం లేదా అశుభం జరుగుతుందని చాలామందిలో బలమైన నమ్మకం, ఒకరకమైన భయం నెలకొంది. అయితే నిజంగానే గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదా? ఈ గ్రంథం కేవలం మరణం గురించే చెబుతుందా? శాస్త్రాలు, ధార్మిక విశ్వాసాలు ఈ విషయంపై ఏం స్పష్టం చేస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం.

గరుడ పురాణం అంటే ఏమిటి?

గరుడ పురాణం అనేది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు మరియు ఆయన వాహనమైన గరుత్మంతుని మధ్య జరిగిన పరమ పవిత్ర సంభాషణ. మానవ జన్మ, మరణం, ఆత్మ ప్రయాణం, కర్మ సిద్ధాంతం, మరణానంతరం జీవుడు పొందే గతులు తదితర అంశాలపై గరుడుడు వేసిన ప్రశ్నలకు శ్రీహరి ఇచ్చిన సమాధానాలే ఈ పురాణ సారం. ఇందులో కేవలం మరణానంతర విషయాలే కాకుండా.. మానవ జీవిత విలువలు, ధర్మం, దానం, పాప-పుణ్యాలు, కర్మఫలం, అంత్యక్రియలు, శ్రాద్ధ విధివిధానాల గురించిన సమగ్ర వివరణ ఉంది.

ఇంట్లో చదవవచ్చా? అశుభం జరుగుతుందా?

ధార్మిక విశ్వాసాలు, శాస్త్రాల ప్రకారం గరుడ పురాణాన్ని ఇంట్లో నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. ఈ గ్రంథాన్ని ఇంట్లో పఠించడం వల్ల అరిష్టం జరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇందులో మరణానంతరం ఆత్మ ప్రయాణం, యమలోక వర్ణనలు, పాపాలకు పడే శిక్షల గురించిన తీవ్రమైన వివరణలు ఉండటం వల్ల సహజంగానే కొందరిలో భయం, అపోహలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా సూతక కాలంలో దీనిని పఠించే ఆచారం ఉండటంతో, ఇది కేవలం ఆ సమయానికే పరిమితమైన గ్రంథమనే భావన సమాజంలో పాతుకుపోయింది. కానీ, పవిత్రమైన మనస్సుతో, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం దీనిని ఇంట్లో ఎప్పుడైనా అధ్యయనం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.

మరణం సంభవించినప్పుడే ఎందుకు చదువుతారు?

కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు గరుడ పురాణం చదవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక ఉద్దేశం ఉంది. మరణం అనేది ప్రతి జీవికి తప్పనిసరి అనే సత్యాన్ని ఆ సమయంలో కుటుంబ సభ్యులకు గుర్తుచేయడం, వారి శోకాన్ని తగ్గించి జీవిత పరమార్థాన్ని అర్థమయ్యేలా చేయడం దీని ముఖ్య లక్ష్యం. అలాగే మరణించిన వ్యక్తి ఆత్మ శాంతికి, మోక్షానికి ఎలాంటి విధివిధానాలు పాటించాలో తెలియజేయడానికి ఈ పఠనం దోహదపడుతుంది.

గరుడ పురాణం ఇచ్చే అసలైన సందేశం ఏంటి?

గరుడ పురాణం అనేది భయపెట్టే పుస్తకం కాదు; అది మానవ జీవితానికి మార్గదర్శి. ఈ భూమిపై మానవ జన్మ శాశ్వతం కాదని, బతికి ఉన్నంత కాలం ధర్మ మార్గంలో నడవాలని, తోటివారికి సహాయం చేయాలని, మంచి పనులు చేస్తూ సత్కర్మలు ఆచరించాలని ఈ పురాణం ఉద్బోధిస్తుంది. మరణం తర్వాత ఎదురయ్యే ఫలితాల గురించి తెలుసుకోవడం ద్వారా మనిషి అధర్మ మార్గాన్ని వీడి సన్మార్గంలో పయనించేలా చేయడమే గరుడ పురాణం యొక్క ప్రధాన అంతరార్థం.

Tags: