TTD: భక్తుల ప్రశాంత దర్శనమే టీటీడీ ప్రధాన లక్ష్యం
టీటీడీ ప్రధాన లక్ష్యం
TTD: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన, ప్రశాంతమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ నిరంతరం పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతోంది.
సర్వదర్శనం, నిర్దేశిత సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వర్చువల్ సేవలు, ఎన్‌ఆర్‌ఐలు, ఇతర ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలపై భక్తులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తోంది.
రద్దీకి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు
ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పరిమితికి మించి పెరుగుతున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, బ్రహ్మోత్సవాలు వంటి విశేష పర్వదినాల్లో భారీగా తరలివచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతోంది.
నిర్దేశిత సమయానికే దర్శనం కల్పించేలా సమన్వయం
స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ నుంచి భక్తులకు కేటాయించిన సమయానికి శ్రీవారి దర్శనం కల్పించే వరకు అన్ని విభాగాలు సమిష్టిగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయి. భక్తుల రద్దీ నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ, తాగునీరు, అన్నప్రసాదం, భద్రత తదితర సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అధికారులు, ఉద్యోగులతోపాటు భద్రత, విజిలెన్స్, అన్నప్రసాదం, తాగునీటి విభాగాలు, శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. నిర్దేశిత సర్వదర్శనంపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకొని సమయానుకూలంగా టిటిడి నిర్ణయాలు చేపడుతోంది.
దళారుల మోసాలపై కఠిన చర్యలు
శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలు కల్పిస్తామని భక్తులను మోసం చేసే దళారులపై టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటోంది. దర్శనం, గదుల కేటాయింపు పేరుతో మోసాలకు పాల్పడిన దళారులపై ఈ సంవత్సరం ఇప్పటివరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా, ఈ సంవత్సరం ఇప్పటివరకు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది ఉద్యోగులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో ఎవరైనా సరే – దళారులైనా, సిబ్బందైనా – రాజీలేని కఠిన చర్యలు ఉంటాయని టీటీడీ స్పష్టం చేస్తోంది.