Sri Kodandarama Temple: శ్రీ కోదండరామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ
పవిత్ర సమర్పణ
Sri Kodandarama Temple: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం కన్నులపండువగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీటితో స్వామివారికి అభిషేకం చేశారు. యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి తీసుకువచ్చారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అలాగే విష్వక్సేనుడు, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాళ్వార్, హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 10న యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.