History of Srivari Brahmotsavams: తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంటే తొమ్మిది రోజుల పాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహా వేడుక. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం, సాయంత్రం జరిగే వాహన సేవలు, లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మార్మోగుతాయి. అయితే ఇప్పుడు కనిపిస్తున్న ఈ బ్రహ్మోత్సవాల వైభవం ఒక్కరోజులో ఏర్పడింది కాదు. దీని వెనుక శతాబ్దాల చరిత్ర ఉంది.

రాజులు, రాణులు, సామంతులు, అధికారులు, భక్తులు చేసిన దానధర్మాలు, ఆలయ నిర్వహణలో వచ్చిన మార్పులు, ఆగమ సంప్రదాయాలు, కాలక్రమంలో కొత్తగా చేరిన ఉత్సవాలు.. ఇవన్నీ కలిసి నేటి బ్రహ్మోత్సవాల రూపాన్ని తీసుకొచ్చాయి. ఈ చరిత్రకు పురాణ కథనాలతో పాటు తిరుమల ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు కూడా ఎంతో ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. టీటీడీ ప్రచురించిన శాసన సంపుటాలు, చారిత్రక గ్రంథాల్లో బ్రహ్మోత్సవాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.

పురాణాల ప్రకారం.. శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలసిన సందర్భంగా బ్రహ్మదేవుడు తొలిసారిగా ఉత్సవాలు నిర్వహించాడని చెబుతారు. అందుకే ఈ ఉత్సవాలకు ‘బ్రహ్మోత్సవాలు’ అనే పేరు వచ్చిందని పురాణ ప్రాశస్త్యం. అయితే బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయనే విషయానికి శాసనాలు మరింత స్పష్టమైన ఆధారాలను అందిస్తున్నాయి.

సామాన్య శకం 966 సంవత్సరం తిరుమల ఉత్సవాల చరిత్రలో ఎంతో ముఖ్యమైనదిగా చెబుతారు. పల్లవ రాజవంశానికి చెందిన రాణి సామవై పెరుందేవి శ్రీవేంకటేశ్వరస్వామివారికి వెండి భోగ శ్రీనివాసమూర్తిని సమర్పించారు. స్వామివారికి అనేక ఆభరణాలు ఇచ్చిన ఆమె.. ఉత్సవాల నిర్వహణ కోసం భూములను కూడా దానం చేశారు. ఆమె చేసిన దానానికి సంబంధించిన శాసనం తిరుమల ఆలయంలోని మొదటి ప్రాకారం ఉత్తర గోడపై ఉంది.

ఈ శాసనం ఆధారంగా 10వ శతాబ్దంలోనే తిరుమలలో బ్రహ్మోత్సవాలు వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పెరటాసి మాసంలో ప్రధాన బ్రహ్మోత్సవంతో పాటు మార్గశిర మాసంలో మరో బ్రహ్మోత్సవం నిర్వహించేందుకు సామవై ఏర్పాట్లు చేశారు. ఆమె సమర్పించిన భోగ శ్రీనివాసమూర్తి కూడా ఆలయ ఉత్సవ సంప్రదాయంలో కీలకంగా మారింది.

10వ శతాబ్దంలో కనిపించిన ఈ సంప్రదాయం ఆ తర్వాత మరింత విస్తరించింది. చోళుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య క్రమంగా పెరిగింది. పెరటాసి, మార్గళి బ్రహ్మోత్సవాల తర్వాత పాంగుని బ్రహ్మోత్సవం కూడా చేరింది. దీన్ని యాదవరాయ సామంతుడు వీర నరసింహ యాదవరాయ కాలానికి సంబంధించినదిగా చెబుతారు. 1254లో చోళ రాజు విజయ గండగోపాలదేవుని కాలంలో చిత్తిరై బ్రహ్మోత్సవం చేరింది. 1300 నుంచి 1330 మధ్య మరో యాదవరాయ సామంతుడి ఆధ్వర్యంలో ఆడి బ్రహ్మోత్సవం కూడా ఏర్పడింది.

దీంతో విజయనగర సామ్రాజ్యం ఏర్పడే సమయానికి తిరుమలలో ఏడాదికి ఐదు బ్రహ్మోత్సవాలు జరిగేవి. వీటిలో మూడు చోళుల కాలంలో, రెండు యాదవరాయుల కాలంలో ఏర్పడ్డాయి. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యంలోని సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు వంశాల కాలంలో తిరుమలలో ఉత్సవాల సంఖ్య మరింత పెరిగింది. కొత్త బ్రహ్మోత్సవాలు కూడా ఈ కాలంలో చేరాయి.

15వ శతాబ్దం నాటికి ఏడాదిలో అనేక బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి ఈ సంప్రదాయం చేరింది. విజయనగర కాలం చివరి దశలో అయితే శాసనాల్లో ఏడాదికి పది బ్రహ్మోత్సవాల వరకు ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. 1539 నుంచి 1616 మధ్య కాలానికి చెందిన శాసనాల్లో పది వార్షిక బ్రహ్మోత్సవాల ప్రస్తావనలు ఉన్నాయి. అంటే.. ఇప్పుడు ఏడాదిలో ఒక బ్రహ్మోత్సవం లేదా అధిక మాసం వచ్చినప్పుడు రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించే సంప్రదాయం వెనుక.. ఒకప్పుడు ఏడాదికి అనేక బ్రహ్మోత్సవాలు జరిగిన సుదీర్ఘ చరిత్ర ఉంది.

తిరుమల చరిత్రలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. శాసనాల ప్రకారం ఆయన 1513 ఫిబ్రవరి 10న తొలిసారి తిరుమలను దర్శించారు. అదే ఏడాది తన జన్మమాసమైన తై మాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అంటే శ్రీవారికి ఆభరణాలు, కానుకలు ఇవ్వడంతో పాటు ఉత్సవాల విస్తరణలోనూ ఆయన పాత్ర ఉంది.

కృష్ణదేవరాయల తర్వాత అచ్యుతరాయల కాలంలో కూడా బ్రహ్మోత్సవాలకు రాజుల ప్రోత్సాహం కొనసాగింది. 1533లో కార్తీక బ్రహ్మోత్సవానికి సంబంధించిన తొలి ప్రస్తావన కనిపిస్తుంది. 1534లో ఈ ఉత్సవానికి విరాళం ఇచ్చినట్లు ఒక శాసనం చెబుతోంది. అచ్యుతరాయల కాలంలో ఈ ఉత్సవానికి వరుసగా దానాలు అందడం.. అది రాజుల ప్రోత్సాహంతో ఏర్పడిన ఉత్సవమని చెప్పడానికి ఆధారంగా నిలుస్తోంది.

1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం కూడా ఏర్పడింది. దీంతో ఏడాదిలో జరిగే బ్రహ్మోత్సవాల సంఖ్య మరోసారి పెరిగింది. కాలక్రమంలో కొత్త ఉత్సవాలు చేరడం, కొన్ని మారడం, మరికొన్ని నిలిచిపోవడం ద్వార…

Tags: