Bengaluru SV Temple: బెంగళూరు ఎస్వీ ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
ప్రారంభం
Bengaluru SV Temple: బెంగళూరులోని ఎస్వీ ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా, వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో పలు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.
ఉదయం ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, 10.30 నుంచి 11.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామివారికి, అమ్మవార్లకు విశేష అభిషేకం చేశారు.
సాయంత్రం వైదిక కార్యక్రమాల అనంతరం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో అలరించాయి.
అక్టోబరు 07న పవిత్ర సమర్పణ, అక్టోబరు 08న పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ బాలరాజు, ఇతర సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.