Sri Prasanna Venkateswara Swamy: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం శాస్త్రోక్తంగా, వైభవంగా ప్రారంభమయ్యాయి.

పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో పలు వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు.

ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, అర్చన నిర్వహించారు. అనంతరం యాగశాలలో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు చేపట్టారు.

ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామివారికి, అమ్మవార్లకు విశేష అభిషేకం చేశారు.

సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం 6.45 గంటల నుంచి పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్రోత్సవాల వైదిక మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

అక్టోబరు 07న పవిత్ర సమర్పణ, అక్టోబరు 08న పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, ఇతర సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags: