టాస్క్ ద్వారా 4,100 మందికి ఉద్యోగాలు
మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి;
ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6 వేల మంది నిరుద్యోగులకు ఆధునాతన సాంకేతిక శిక్షణ అందించి ప్లేస్ మెంట్స్ కల్పించేలా భారీ లక్ష్యం నిర్దేశించుకోవాలని తెలంగాణా అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) అధికారులను ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు.
శుక్రవారం నాడు ఆయన 'టాస్క్' చేపడుతున్న కార్యక్రమాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. గడచిన ఏడాది కాలంలో 4100 మంది ఉద్యోగాలు పొందడంలో టాస్క్ క్రియాశీలకంగా వ్యవహరించడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో టాస్క్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన తెలిపారు ఇండస్ట్రీ అవసరాలకు తగిన విధంగా ఆయా స్కిల్స్ లో శిక్షణ అందించి ఉద్యోగాలు పొందడంలో సాయం చేస్తోందని చెప్పారు. గడచిన ఏడాది కాలంలో టాస్క్ సంస్థ రికార్డు స్థాయిలో 1,37,677 మంది విద్యార్థులు, 2791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు వివిధ సాంకేతిక, నైపుణ్య అంశాల్లో శిక్షణ అందించిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. "21 జిల్లాల్లోని 148 కళాశాలు, పలు కంపెనీల ప్రాంగాణాల్లో నిర్వహించిన జాబ్ మేళాల్లో 4100 మంది ప్రతిభావంతులు ఉద్యోగాలు పొందడంలో టాస్క్ కీలక పాత్ర పోషించింది. వెరిస్క్ ఎనలైటిక్స్ అనే అమెరికన్ కంపెనీ హైదరాబాద్ క్యాంపస్ కోసం ఏడాదికి రూ.11 లక్షల ప్యాకేజితో సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంది.
ఉద్యోగాలు సాధించిన మొత్తం 4100 మందిలో, కనీస వార్షిక ప్యాకేజి రూ.2.4 లక్షలు. హ్యుండాయ్ మోబిస్ సంస్థ టాస్క్ ద్వారా 42 మందికి శిక్షణ అందించి ఉద్యోగాల్లో నియమించుకుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) రూ.6 లక్షల వార్షిక ప్యాకేజితో 63 మందిని రిక్రూట్ చేసుకుంది. 1M1B (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ఫౌండేషన్ తెలంగాణాలో ఏర్పాటు చేసిన గ్రీన్ స్కిల్స్ అకాడెమీ ద్వారా మేడ్చెల్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మంచిర్యాల జిల్లాల నుంచి 7,000 మంది విద్యార్ధులు శిక్షణ పొందారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు ఐక్యరాజ్య సమితి 2024 డిసెంబర్ లో న్యూయార్క్ లో నిర్వహించిన గ్లోబల్ సదస్సుకు హాజరయ్యారు.
అంగ వైకల్యం ఉన్న యువతకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చి ఉద్యోగాలు పొందేలా సాయపడేందుకు, ఎంట్రప్రెన్యూర్లుగా ఎదిగేందుకు టాటా ట్రస్ట్ తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద మూడేళ్ల పాటు టాటా సంస్థ శిక్షణ కార్యక్రమాలు చేపడుతుంది.