విదేశీ స్టూడెంట్ల వీసా రిక్రూట్ మెంట్ కు బ్రేకులు!!

Update: 2025-05-28 09:13 GMT
  • వీసా అపాయింట్ మెంట్లు షెడ్యూల్ వద్దన్న అమెరికా
  • ఉన్నవారిని నిశితంగా పరిశీలిస్తున్నాం
  • నేర చరిత్ర, సోషల్ మీడియా యాక్టివిటీయే ప్రాతిపదిక
  • ఉద్యమించే వారి ఊసే వద్దంటున్న అమెరికా
  • అమెరికా ప్రగతికి ఉపయోగపడితేనే ఛాన్స్
  • ఇన్ స్టాగ్రామ్, ఎక్స్, టిక్ టాక్ లలో పోస్టులే ప్రామాణికం
  • క్లాసులు బంక్ కొట్టినా.. కోర్సు డ్రాప్ అయినా డిపోర్టింగే
  • ఇమ్మిగ్రంట్లపై ట్రంప్ కొత్త ఆంక్షలు

ఇమ్మిగ్రంట్లపై కక్షకట్టిన ట్రంప్ వారిని వెళ్ల గొట్టేందుకు రకరకాల కొత్త ప్లాన్ లు అమల్లోకి తెస్తున్నారు. తాజాగా విదేశీ స్టూడెంట్ల వీసా రిక్రూట్ మెంట్ కు బ్రేక్ వేశారు.స్టూడెంట్ వీసాకు అప్లయ్ చేసుకునే విదేశీ విద్యార్ధుల ప్రయత్నాలను నీరు కార్చేందుకు ప్రోసెస్ మరింత కఠినతరం చేసేశారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికన్ ఎంబసీల్లోనూ స్టూడెంట్ వీసా అపాయింట్ మెంట్లను షెడ్యూల్ చేయవద్దని ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం స్టూడెంట్ల సోషల్ మీడియా కార్యకలాపాలపై నిఘా పెట్టినందున ఇప్పుడే షెడ్యూల్ చేయవద్దని అమెరికా హోం శాఖ అన్ని ఎంబసీలకు సూచనలు చేసింది.

ప్రోసెస్ మరింత కఠినం..

వీసా మంజూరు ప్రక్రియకు సవాలక్ష ఆంక్షలు పెట్టిన ట్రంప్ ప్రభుత్వం విదేశీ విద్యార్ధులు, స్టూడెంట్లను దేశంలోకి అనుమతించాల్సిన అవసరం ఉందా అన్న అంశాన్ని పరిశీలిస్తోంది.

వీసా అప్లయ్ చేస్తున్నది స్టూడెంటా, లేక టూరిస్టా? అమెరికా దగ్గరున్న సాంకేతిక పరికరాల ఆధారంగా దరఖాస్తుదారుని అన్ని కోణాల్లోంచి నిశితంగా పరిశీలించి వాళ్లు నిజమైన వారు అవునా కాదా అన నిర్ధారించుకుంటామని అమెరికా హోం శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ అన్నారు.

నేర చరిత్ర పరిశీలన..

ఈమొత్తం పరి శీలన ప్రక్రియలో అసలు అప్లయ్ చేసినది ఎవరు? వారి లక్ష్యాలు ఏమిటి. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఏదైనా ఉందా? వారెందుకొస్తున్నారు. వారు అమెరికా ప్రగతికి ఏమైనా సాయపడగలరా? అన్నవిషయాలు కూలంకషంగా పరిశీలిస్తామని, కాబట్టి ఇంతకుమించి వీసా సెలక్షన్ ప్రోసెస్ వివరాలు చెప్పదలచుకోలేదని అన్నారు.దేశానికి మనం ఉపయోగపడగలమా అన్న విషయాన్ని దరఖాస్తు దారే అర్ధం చేసుకునేలా ప్రోసెస్ తీర్చి దిద్దుతున్నామని అన్నారు.

బంక్ కొడితే బంద్ అయినట్లే..

ప్రస్తుతం ఉన్న విదేశీ స్టూడెంట్లు క్లాసులు బంక్ కొట్టినా, కోర్సు మధ్యలో డ్రాపవుట్ అయినా వారి ఫారిన్ స్టూడెంట్ వీసా తక్షణం రద్దవుతుంది. వీసా పొడిగించుకుని అనధికారిక ఉద్యోగం లేదా ఉపాధిలో కొనసాగేవారిని రద్దు చేసి వెనక్కు పంపేస్తారు.

ప్రశ్నించే రీతిలో లేదా ఉద్యమించే రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని దేశ భద్రతకు ముప్పుగా పరిగణిస్తామని, వారిని తక్షణం వెనక్కు పంపేస్తామని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కోర్సు మధ్యలో ఉన్న స్టూడెంట్లు చిన్న చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, లేదా మద్యం సంబంధిత కేసుల్లోనూ, ఉన్న వారిని వీసా రద్దు చేసి వెనక్కు పంపేస్తున్నారు.ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అనేకమంది విద్యార్ధులు కోర్టుల్లో కేసులు వేసి తమ హక్కును రాబట్టుకున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో వారిని అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు అసలు స్టూడెంట్ వీసా నిబంధనలు, ఎంపిక ప్రక్రియలనే కఠినాతికఠినతరం చేసేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News