Cinnamon: దాల్చిన చెక్కతో ఇన్ని ప్రయోజనాలా.?
ఇన్ని ప్రయోజనాలా.?;
Cinnamon: దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే మంచి లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్క వేసి 15-20 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా తాగాలి. అది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
దాల్చిన చెక్క నీటిలో ఉండే పాలీఫెనాల్స్, ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వినియోగం జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. దాల్చిన చెక్కలో థర్మోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీర వేడిని పెంచడం ద్వారా కొవ్వును కాల్చడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడు నుండి లభిస్తుంది.
టైప్2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కెరల నియంత్రణకు దాల్చినచెక్క బాగా ఉపయోగపడుతోందని కాలిఫోర్నియాలోని వెస్టర్న్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. పరిశోధనలో భాగంగా.. 543 మంది టైప్2 మధుమేహ రోగుల్లో కొంతమందికి దాల్చినచెక్కను రోజుకు 120 మిల్లీగ్రాముల నుంచి 6 గ్రాముల వరకూ మాత్రల రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి నకిలీ మాత్రలు ఇచ్చారు. తర్వాత ఫలితాలను పరిశీలించగా.. దాల్చిన చెక్క మాత్రలు తీసుకున్నవారి రక్తంలో చక్కెరల స్థాయి మిగతావారికన్నా మెరుగ్గా నియంత్రణలో ఉన్నట్లు తేలింది.