Knee and Joint Pains Getting Worse During the Monsoon: వర్షాకాలం రాగానే వాతావరణం ఆహ్లాదకరంగా మారినప్పటికీ, వయోవృద్ధులు, ఆర్థరైటిస్ తో బాధపడేవారికి కొత్త తిప్పలు మొదలవుతాయి. వర్షాలు పడే సమయంలో చాలామందికి మోకాళ్ళ నొప్పులు, కీళ్లలో బిగుతు వాపులు తీవ్రమవ్వడం సర్వసాధారణం. అయితే ఈ వాతావరణంలోనే నొప్పులు ఎందుకు పెరుగుతాయి? దీనికి నిపుణులు చెబుతున్న కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో కీళ్ల నొప్పులు పెరగడానికి ప్రధాన కారణాలు

వాతావరణ పీడనం తగ్గడం

వర్షాకాలంలో గాలి పీడనం తగ్గుతుంది. దీనివల్ల శరీరంలోని కణజాలాలు స్వల్పంగా ఉబ్బి, నాడుల పై ఒత్తిడి పెంచుతాయి. ఫలితంగా కీళ్లలో నొప్పి, అసౌకర్యం పెరుగుతాయి.

ఉష్ణోగ్రత పడిపోవడం - తేమ

చల్లని వాతావరణం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి కీళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల కీళ్ళు బిగుసుకుపోయి నడవడానికి లేదా మడతపెట్టడానికి ఇబ్బందిగా మారుతుంది.

శారీరక శ్రమ తగ్గడం

వర్షాల వల్ల బయటకు వెళ్లడం తగ్గిపోవడం, ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల శరీరం మొద్దుబారి నొప్పులు హెచ్చురిల్లుతాయి.

నొప్పుల నుండి ఉపశమనం పొందే మార్గాలు

గోరువెచ్చని కాపడం

నొప్పులు ఉన్న ప్రాంతంలో గోరువెచ్చని నీటి సంచి లేదా హాట్ ప్యాక్‌తో కాపడం పెట్టడం వల్ల రక్తప్రసరణ పెరిగి నొప్పి, బిగుతు తగ్గుతాయి.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం

చలి గాలి తగలకుండా ఒళ్లంతా కప్పే దుస్తులు, సాక్స్ ధరించాలి. ఏసీ లేదా ఫ్యాన్ గాలి నేరుగా శరీరంపై పడకుండా చూసుకోవాలి.

ఇంట్లోనే చిన్నపాటి వ్యాయామాలు

బయటకు వెళ్లలేకపోయినా ఇంట్లోనే తేలికపాటి స్ట్రెచింగ్స్, యోగా లేదా నడక చేయడం ద్వారా కీళ్లను చురుగ్గా ఉంచుకోవాలి.

హైడ్రేషన్ - పోషకాహారం

వర్షాకాలంలో దాహం వేయనప్పటికీ తగినంత నీరు తాగాలి. విటమిన్-డి, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Tags: