Vegetarian: భారతదేశంలో శాకాహారం తీసుకునే వారి సంఖ్య ఎప్పటి నుంచో ఎక్కువ. ఇటీవలి కాలంలో వీగన్ జీవనశైలి వైపు కూడా చాలామంది మొగ్గు చూపుతున్నారు. జీర్ణక్రియకు, ఆరోగ్యానికి శాకాహారం ఎంతో మేలు చేసినప్పటికీ, సరైన సమతుల్య ఆహారం తీసుకోకపోతే కొన్ని కీలక పోషకాల లోపం తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శాకాహారుల్లో సాధారణంగా కనిపించే 5 ప్రధాన పోషకాల లోపాలు, వాటివల్ల కలిగే నష్టాలు మరియు వాటిని భర్తీ చేసుకునే మార్గాలు ఇక్కడ తెలుసుకుందాం.

విటమిన్ బి12

శాకాహారుల్లో అత్యంత ఎక్కువగా కనిపించే సమస్య విటమిన్ బి12 లోపం. దీని లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, కాళ్లు చేతుల్లో తిమ్మిర్లు (సూదులతో గుచ్చినట్లు అనిపించడం), నరాల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. జంతు సంబంధిత ఆహారంలో బి12 ఎక్కువగా లభిస్తుంది కాబట్టి శాకాహారులు ఫోర్టిఫైడ్ ఆహారాలు విటమిన్లు చేర్చిన ఫుడ్స్ తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడాలి.

ఐరన్

శరీరంలో ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం.

నష్టాలు: ఐరన్ తగ్గితే రక్తహీనత ఏర్పడుతుంది. తలతిరగడం, ఆయాసం రావడం, శ్వాస సరిగ్గా అందకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

పరిష్కారం: ఆకుకూరలు , బెల్లం, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

ప్రొటీన్

కండరాల పుష్టికి, శరీర కణాల పునరుద్ధరణకు ప్రొటీన్ కీలకం.

నష్టాలు:

సరిపడా ప్రొటీన్ అందకపోతే కండరాలు బలహీనపడతాయి, చిన్నపాటి శ్రమకే ఒంట్లో శక్తి నశిస్తుంది, గాయాలు త్వరగా మానవు. పప్పు ధాన్యాలు, శనగలు, రాజ్మా, సోయాబీన్స్, పనీర్, పాలు, పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవాలి.

కాల్షియం

ఎముకలు, దంతాల పటిష్టతకు మాత్రమే కాకుండా గుండె పనితీరుకు కూడా కాల్షియం అవసరం.

నష్టాలు:

దీర్ఘకాలంలో కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారి, ఫ్రాక్చర్లు అయ్యే ముప్పు పెరుగుతుంది.

పరిష్కారం: పాలు, పాల ఉత్పత్తులతో పాటు రాగులు, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్

మెదడు, గుండె చురుగ్గా, ఆరోగ్యంగా పనిచేయడానికి ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు అత్యంత ముఖ్యం.

నష్టాలు: గుండె ఆరోగ్యం దెబ్బతినడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

పరిష్కారం:

అవిసె గింజలు, చియా సీడ్స్, వాల్‌నట్స్ (అక్రూట్స్) వంటి వాటిని తీసుకోవడం ద్వారా ఒమేగా-3 ని పొందవచ్చు.

నిపుణుల సలహా..

ఏదైనా పోషక లోపం ఉందని భావిస్తే, సొంత వైద్యంతో మెడికల్ షాపుల్లో సప్లిమెంట్లు కొని వాడకూడదు. రక్త పరీక్షలు చేయించుకుని, వైద్యులను సంప్రదించిన తర్వాతే సరైన మార్గదర్శకాలను పాటించాలి. సమతుల్యమైన పౌష్టికాహారమే సంపూర్ణ ఆరోగ్యానికి పునాది.

Tags: