Kidneys: మానవ శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను, అదనపు నీటిని బయటకు పంపడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే రోజూ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు క్రమంగా కిడ్నీలపై అధిక ఒత్తిడిని పెంచి, కాలక్రమేణా వాటి పనితీరును నిర్వీర్యం చేస్తాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏయే అలవాట్లను వెంటనే మార్చుకోవాలో పరిశీలిద్దాం.

కిడ్నీలను దెబ్బతీసే 5 సాధారణ తప్పులు..

ఎసిడిటీ మందులు అధికంగా వాడటం

కడుపులో మంట లేదా ఎసిడిటీ రాగానే చాలామంది సొంతంగా యాంటాసిడ్ మాత్రలు వేసుకుంటుంటారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం పాటు యాంటాసిడ్లను వాడటం కిడ్నీలకు హానికరం. కొన్ని మందులు కిడ్నీ ఫిల్టర్లలో వాపును కలిగించి, వాటి వడపోత సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి.

వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ తీసుకోవడం

చిన్నపాటి జలుబు, జ్వరం వచ్చినా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ కొని వేసుకునే అలవాటు చాలామందిలో ఉంటుంది. డోసేజ్ తెలియకుండా అధికంగా వాడే యాంటీబయాటిక్స్ కిడ్నీ కణజాలంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి డాక్టర్ సూచించిన మేరకే వీటిని ఉపయోగించాలి.

పెయిన్‌కిల్లర్స్ విచ్చలవిడిగా మింగడం

తలనొప్పి, ఒళ్లు నొప్పులు వచ్చినప్పుడు పెయిన్‌కిల్లర్లను మింగడం సర్వసాధారణమైపోయింది. పెయిన్‌కిల్లర్స్ రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేసి కిడ్నీలకు చేరే రక్తాన్ని తగ్గిస్తాయి. దీనివల్ల కిడ్నీల ఫిల్టరింగ్ వ్యవస్థ క్రమంగా దెబ్బతింటుంది.

ఆహారంలో ఉప్పు, ప్యాక్డ్ ఫుడ్స్ మితిమీరి తీసుకోవడం

ఆహారంలో ఉప్పు అధికంగా చేరితే రక్తపోటు పెరుగుతుంది. పెరిగిన రక్తపోటు కిడ్నీ నాళాలపై నేరుగా ఒత్తిడి తెస్తుంది. చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్డ్ ఆహారాలలో ఉప్పుతో పాటు ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది కాబట్టి వాటిని పరిమితంగానే తీసుకోవాలి.

సాఫ్ట్ డ్రింక్స్, చక్కెర పానీయాలు తాగడం

సోడాలు, కూల్ డ్రింక్స్, అధిక చక్కెర కలిగిన డ్రింక్స్‌ను తరచూ తీసుకోవడం వల్ల జీవక్రియలు దెబ్బతింటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచడమే కాకుండా దీర్ఘకాలంలో మూత్రపిండాల ఆరోగ్యాన్ని తీవ్రంగా క్షీణింపజేస్తాయి.

Tags: