Bleeding Gums: దంతాల నుండి రక్తం వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే పళ్లు ఊడిపోయే ప్రమాదం..
పళ్లు ఊడిపోయే ప్రమాదం..
Bleeding Gums: ఉదయాన్నే బ్రష్ చేసుకునే సమయంలో లేదా గట్టి ఆహార పదార్థాలను నమిలేటప్పుడు చిగుళ్ల నుండి రక్తం రావడం చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్య. అయితే దీనిని చిన్న విషయంగా తీసిపారేస్తే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పళ్లు దృఢంగా ఉంటాయి.
చిగుళ్ళ నుండి రక్తం రావడానికి ప్రధాన కారణాలు
సరిగ్గా నోటి పరిశుభ్రత పాటించకపోవడం, పళ్ళపై ప్లాక్, టార్టార్ పేరుకుపోవడం, పోషకాహార లోపం, డయాబెటిస్ లేదా పొగతాగే అలవాటు వల్ల చిగుళ్ళ సమస్యలు వస్తుంటాయి.
జింజివైటిస్ :
ఇది చిగుళ్ళ వాపుకు సంబంధించిన తొలి దశ. బ్రషింగ్ సమయంలో రక్తం రావడం, చిగుళ్ళు ఎర్రబడటం, వాపు మరియు నోటి దుర్వాసన దీని ప్రధాన లక్షణాలు.
పెరియోడోంటైటిస్:
జింజివైటిస్‌ను ప్రారంభంలోనే తగ్గించుకోకపోతే అది పెరియోడోంటైటిస్‌గా మారుతుంది. ఈ దశలో చిగుళ్లు, పళ్ల మధ్య ఖాళీ ఏర్పడి బ్యాక్టీరియా చేరుతుంది. ఇది పళ్ళను పట్టి ఉంచే ఎముకలను, కణజాలాన్ని దెబ్బతీసి, పళ్ళు కదలడానికి లేదా ఊడిపోవడానికి కారణమవుతుంది.
విటమిన్ల లోపం కూడా కారణమే..
శరీరంలో విటమిన్ C, విటమిన్ K లోపించినా చిగుళ్ళ నుండి రక్తం వచ్చే అవకాశం ఉంది.
విటమిన్ C లభించే ఆహారాలు: బత్తాయి, నారింజ, ఉసిరి, నిమ్మకాయ, జామకాయ, క్యాప్సికమ్.
విటమిన్ K లభించే ఆహారాలు: పాలకూర, మెంతికూర, బ్రోకలీ, ఆకుకూరలు.
ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
వరుసగా కొన్ని రోజుల పాటు చిగుళ్ళ నుండి రక్తం వస్తుంటే.
చిగుళ్ళలో విపరీతమైన నొప్పి, వాపు లేదా చీము పట్టినట్లు అనిపిస్తే.
పళ్ళు ఊగుతున్నట్లు లేదా చిగుళ్ళ నుండి పళ్ళు దూరమవుతున్నట్లు అనిపిస్తే.
నోటి దుర్వాసన ఎంతకీ తగ్గకపోతే.
ఆరోగ్యకరమైన చిగుళ్ళ కోసం చిట్కాలు:
రోజుకు కనీసం రెండుసార్లు మృదువైన బ్రష్‌తో పళ్ళు శుభ్రం చేసుకోవాలి.
ప్రతిరోజు డెంటల్ ఫ్లాసింగ్ అలవాటు చేసుకోవాలి.
ప్రతి మూడు నెలలకొకసారి టూత్ బ్రష్ మార్చాలి.
పొగాకు, గుట్కా, ధూమపానానికి దూరంగా ఉండాలి.
తీపి పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి.
ప్రతి ఆరు నెలలకొకసారి డెంటిస్ట్‌ను కలిసి నోటి పరీక్షలు చేయించుకోవడం మంచిది.