Bone Pain at a Young Age: యవ్వనంలోనే ఎముకల నొప్పులా? కేవలం కాల్షియం ఉంటే సరిపోదు.. ఈ పోషకాలు కూడా ఉండాల్సిందే..
ఈ పోషకాలు కూడా ఉండాల్సిందే..
Bone Pain at a Young Age: నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది కీళ్ల నొప్పులు, ఎముకల బలహీనతతో సతమతమవుతున్నారు. ఎముకల ఆరోగ్యం అంటే కేవలం కాల్షియం మాత్రమే అని అందరూ భావిస్తారు. కానీ, ఎముకలు ఉక్కులా బలంగా ఉండాలంటే కాల్షియంతో పాటు మరికొన్ని కీలక పోషకాలు అవసరమని ఆర్థోపెడిక్ నిపుణులు వివరిస్తున్నారు.
ఎముకలు ఎందుకు బలహీనపడుతున్నాయి?
మన శరీరంలో ఎముకలు నిరంతరం విచ్ఛిన్నమవుతూ.. తిరిగి నిర్మించబడుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఎముకలు పలుచబడి, బలహీనంగా మారుతాయి. దీనివల్ల ఆస్టియోపొరోసిస్ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా సరైన పోషకాహారం లేకపోవడం మరియు నిశ్చల జీవనశైలి దీనికి ముఖ్య కారణాలు.
కాల్షియంతో పాటు కావాల్సిన ఇతర పోషకాలు:
డాక్టర్ పటేల్ ప్రకారం, ఎముకల దృఢత్వానికి ఈ పోషకాలు అత్యంత అవసరం..
విటమిన్ డి: మనం తీసుకునే కాల్షియంను శరీరం గ్రహించాలంటే విటమిన్ డి తప్పనిసరి.
ప్రోటీన్: ఎముకల నిర్మాణంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.
విటమిన్ కె: ఇది ఎముకల సాంద్రతను పెంచడానికి, కాల్షియంను ఎముకల్లోకి చేర్చడానికి తోడ్పడుతుంది.
ఎముకలను బలపరిచే 8 శాకాహార ఆహారాలు:
మీ డైట్‌లో ఈ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు..
ఆకుకూరలు: పాలకూర, తోటకూర వంటి వాటిలో కాల్షియం, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
రాగులు: కాల్షియం అధికంగా ఉండే తృణధాన్యాల్లో రాగులు మొదటి స్థానంలో ఉంటాయి.
పాలు - పాల పదార్థాలు: పాలు, పెరుగు, పన్నీర్ ద్వారా కాల్షియం లభిస్తుంది.
సోయా: సోయా బీన్స్ లేదా సోయా మిల్క్ ప్రోటీన్, కాల్షియంకు మంచి వనరు.
బాదం: ఇందులో మెగ్నీషియం, కాల్షియం మరియు విటమిన్ ఇ ఉంటాయి.
నువ్వులు: రోజుకు ఒక స్పూన్ నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలకు కావాల్సిన కాల్షియం అందుతుంది.
బ్రోకోలీ: ఇందులో విటమిన్ సి, కె మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
బీన్స్ - పప్పుధాన్యాలు: ఇవి ఎముకల పునర్నిర్మాణానికి కావాల్సిన మెగ్నీషియం, ప్రోటీన్‌ను అందిస్తాయి.