Routine CBC Blood Test Detect Blood Cancer: సాధారణంగా ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు వైద్యులు మొదటగా సూచించే పరీక్షలలో CBC ప్రధానమైనది. అయితే, ఈ సాధారణ సీబీసీ పరీక్ష ద్వారా ప్రాణాంతకమైన రక్త క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.

CBC పరీక్ష ఏం తెలియజేస్తుంది?

సీబీసీ అనేది రక్తంలోని ఎర్ర రక్తకణాలు , తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్ సంఖ్యను తెలియజేసే ఒక ప్రాథమిక పరీక్ష. లుకేమియా వంటి కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లలో రక్త కణాల సంఖ్యలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. అయితే, కేవలం సీబీసీ ఫలితాల ఆధారంగానే బ్లడ్ క్యాన్సర్‌ను నిర్ధారించలేము. ఇది కేవలం ప్రాథమిక సూచనను లేదా అనుమానాన్ని మాత్రమే కలిగిస్తుంది.

ఇతర కీలక లక్షణాలు - వైద్య పరీక్షలు

వైద్యులు కేవలం రక్త పరీక్ష రిపోర్టును మాత్రమే కాకుండా, రోగి శారీరక లక్షణాలు మరియు వైద్య చరిత్రను కూడా పరిశీలిస్తారు:

శారీరక లక్షణాలు: శోషరస గ్రంథులు వాపు రావడం, ప్లీహం పరిమాణం పెరగడం, చర్మంపై ఎరుపు, నలుపు లేదా ఊదా రంగు మచ్చలు, దద్దుర్లు ఏర్పడటం, సులభంగా గాయాలు కావడం మరియు అసాధారణ రక్తస్రావం కావడం వంటివి రక్త సంబంధిత తీవ్ర సమస్యలను సూచిస్తాయి. పెరిఫెరల్ బ్లడ్ స్మియర్ సీబీసీలో మార్పులు కనిపిస్తే, మైక్రోస్కోప్ కింద రక్త నమూనాను పరిశీలించి కణాల ఆకృతి, స్వభావాన్ని గుర్తిస్తారు.

అన్ని రకాల క్యాన్సర్లను CBC పసిగట్టలేదా?

లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లలో సీబీసీ పరీక్ష సాధారణంగానే వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో క్యాన్సర్ కణాలు రక్తంలో వెంటనే బయటపడవు. అందువల్ల క్యాన్సర్ అనుమానం ఉంటే వైద్యులు మరింత లోతైన పరీక్షలను సిఫార్సు చేస్తారు:

బయాప్సీ : ప్రభావితమైన లింఫ్ నోడ్స్ లేదా కణజాలం నుండి చిన్న నమూనాను సేకరించి ల్యాబ్‌లో పరీక్షించడం (ముఖ్యంగా లింఫోమా నిర్ధారణ కోసం).

బోన్ మ్యారో టెస్ట్ : తుంటి ఎముక నుండి సూది ద్వారా మూలుగను సేకరించి పరిశీలిస్తారు. ఇది లుకేమియా, మైలోమా వంటి సమస్యలను ఖచ్చితంగా నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.

మాలిక్యులర్ టెస్టింగ్ : క్యాన్సర్ కణాల డీఎన్‌ఏ మార్పులు, జన్యు ఉత్పరివర్తనాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది వ్యాధి తీవ్రతను అంచనా వేసి, రోగికి తగిన ఖచ్చితమైన చికిత్సను అందించేందుకు సహాయపడుతుంది.

చికిత్సా పద్ధతులు

బ్లడ్ క్యాన్సర్ రకం మరియు వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సంప్రదాయ కీమోథెరపీతో పాటు ఆధునిక ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అలాగే తీవ్రమైన సందర్భాల్లో బోన్ మ్యారో లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందిస్తున్నారు.

Tags: