Green Smoothies Boost Fertility: గ్రీన్ స్మూతీస్‌తో సంతానోత్పత్తి పెరుగుతుందా? I
పెరుగుతుందా? I
Green Smoothies Boost Fertility: ప్రస్తుతం సోషల్ మీడియాలో 'గ్రీన్ స్మూతీస్' ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. బరువు తగ్గాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా ఆకుకూరలతో చేసే ఈ డ్రింక్స్ తీసుకోవాలని చాలా మంది చెబుతుంటారు. అంతేకాదు, ఇవి సంతానోత్పత్తిని (Fertility) పెంచుతాయని, ముఖ్యంగా IVF చికిత్స తీసుకునేవారికి అద్భుతంగా పనిచేస్తాయని పెద్ద ప్రచారమే జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత?
అసలు ప్రచారం వెనుక ఉన్న మాటేమిటి?"బచ్చలికూర, కీరా దోసకాయ, ఆకుపచ్చని పండ్లు వంటి వాటితో తయారు చేసే గ్రీన్ స్మూతీస్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయని, అందుకే ఇవి సంతానోత్పత్తికి మంచివని చాలామంది నమ్ముతారు. అయితే, కేవలం ఇవి మాత్రమే గర్భధారణ అవకాశాలను మాయాజాలంలా పెంచేస్తాయనడం కేవలం ఒక అపోహ మాత్రమే అని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
ప్రముఖ ఐవీఎఫ్ (IVF) , సంతానోత్పత్తి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రీన్ స్మూతీస్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వీటివల్ల అద్భుతాలు జరుగుతాయనడం కేవలం అపోహ మాత్రమే. పైగా, వీటి తయారీలో కొన్ని పొరపాట్లు చేస్తే రివర్స్ ప్రభావం పడుతుంది. స్మూతీస్‌లో పండ్లను ఎక్కువగా వాడటం వల్ల వాటిలోని ఫ్రక్టోజ్ (రైసెస్ ఇన్ షుగర్) రక్తంలో చక్కెర స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, ఇన్సులిన్ స్పైక్స్‌కు దారితీస్తుంది. ఇది ప్రత్యక్షంగా అండం (Egg), వీర్యకణాల నాణ్యతపై ప్రభావం చూపుతుంది.
సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి కేవలం ఒకే రకమైన ఆహారంపై లేదా గ్రీన్ స్మూతీస్‌పై పూర్తిగా ఆధారపడలేమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పండ్లు, ఆకుకూరలతో పాటు తగినంత ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు (Healthy Fats), సమతుల్య ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం. అలాగే, శరీర బరువు నియంత్రణలో ఉండటం ఐవీఎఫ్ సక్సెస్ రేటులో కీలక పాత్ర పోషిస్తుంది.
కాబట్టి, గ్రీన్ స్మూతీస్‌ని మీ డైట్‌లో భాగం చేసుకోవడంలో తప్పులేదు కానీ, అవే సంతానోత్పత్తికి సంజీవని అనుకోవడం పొరపాటే. సంతానోత్పత్తి సమస్యలు ఉన్నవారు సోషల్ మీడియా చిట్కాల కంటే, నిపుణులైన వైద్యులను సంప్రదించి సరైన పోషకాహార నిపుణుల పర్యవేక్షణలో ఉండటమే ఎల్లప్పుడూ సురక్షితం.