High Blood Pressure Lead to Memory Loss: ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తోంది. ఒకప్పుడు కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించే ఈ సమస్య, ఇప్పుడు యువతలోనూ సర్వసాధారణమైపోయింది. చాలామంది బీపీని కేవలం గుండెకు సంబంధించిన సమస్యగానే భావిస్తారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే అది మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తుంది.

అధిక రక్తపోటు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఏ లక్షణాలను లైట్ తీసుకోకూడదు? దీన్ని ఎలా నియంత్రించాలో ఇప్పుడు చూద్దాం.

మెదడు ఆరోగ్యంపై బీపీ ప్రభావం

దీర్ఘకాలంగా హైబీపీతో బాధపడుతున్న వారిలో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మెదడుకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు తగ్గిపోతాయి. ఫలితంగా:

ఆలోచించే సామర్థ్యం నెమ్మదిస్తుంది.

విషయాలపై ఏకాగ్రత లోపిస్తుంది.

మతిమరుపు, మానసిక బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: చాలామంది ఈ లక్షణాలను సాధారణ అలసట, తలనొప్పి లేదా ఆఫీస్ ఒత్తిడి అని పొరబడి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇది మెదడు ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి ముందస్తు సంకేతం కావచ్చు.

నిర్లక్ష్యం చేయకూడని ముఖ్యమైన లక్షణాలు

మీలో ఈ లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి..

తరచుగా విషయాలను మర్చిపోవడం

ఏకాగ్రత కుదరకపోవడం

తరచూ తలతిరగడం

నిరంతరంగా వేధించే తలనొప్పి

తీవ్రమైన గందరగోళం లేదా మానసిక అలసట

ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి, బీపీ పరీక్షతో పాటు మెదడు ఆరోగ్యానికి సంబంధించిన స్క్రీనింగ్ చేయించుకోవడం ఉత్తమం.

హైబీపీని కంట్రోల్ చేసి.. మెదడును కాపాడుకునే మార్గాలు

ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం.. జీవనశైలిలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు..

1క్రమబద్ధమైన తనిఖీలు:

మీ రక్తపోటు స్థాయిలను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి.

ఆహార నియమాలు:

రోజువారీ ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. పండ్లు, కూరగాయలతో కూడిన పోషకాహారాన్ని భాగం చేసుకోవాలి.

శారీరక శ్రమ: ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.

మానసిక ప్రశాంతత:

ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయాలి. రాత్రి వేళల్లో కనీసం 7-8 గంటల మంచి నిద్ర అవసరం.

చెడు అలవాట్లకు దూరం:

ధూమపానం, మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే గుండె, మెదడు అంత సురక్షితంగా ఉంటాయి.

అధిక రక్తపోటును ప్రారంభ దశలోనే గుర్తించి, నియంత్రణలో ఉంచుకుంటే గుండె జబ్బులనే కాకుండా పక్షవాతం మతిమరుపు వంటి ప్రమాదకరమైన మానసిక రోగాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. చురుకైన మెదడు కోసం బీపీని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా అవసరం.

Tags: