Thyroid Problems Cause High Blood Pressure: థైరాయిడ్ సమస్యల వల్ల రక్తపోటు పెరుగుతుందా? వైద్యులు ఏమంటున్నారు?
వైద్యులు ఏమంటున్నారు?
Thyroid Problems Cause High Blood Pressure: చాలా మంది హైపోథైరాయిడిజం అనగానే... కేవలం అలసట, బరువు పెరగడం,పొడి చర్మం వంటి లక్షణాలు మాత్రమే అనుకుంటారు. కానీ, దీని వెనుక ఒక నిశ్శబ్ద ప్రమాదం దాగి ఉందని మీకు తెలుసా? అవును... హైపోథైరాయిడిజం మీ గుండె ఆరోగ్యాన్ని , రక్తపోటును (Blood Pressure) కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
మన మెడ ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి... జీవక్రియ, హృదయ స్పందన రేటు మరియు రక్త ప్రసరణను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు లోపించినప్పుడు... లోపలి వ్యవస్థలన్నీ మందగిస్తాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడి, రక్త ప్రవాహ సౌలభ్యం తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు వేగంగా పెరుగుతుంది.పరిశోధనల ప్రకారం... అధిక రక్తపోటు ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉండే అవకాశం ఉంది. సాధారణ వారితో పోలిస్తే, హైపర్‌టెన్షన్ ఉన్నవారికి హైపోథైరాయిడిజం వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువ.
ముంబైకి చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ మనోజ్ చద్దా ప్రకారం"హైపోథైరాయిడిజం గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించడమే కాకుండా, బిపిని పెంచుతుంది. థైరాయిడ్‌కు సరైన చికిత్స అందించడం ద్వారా హార్మోన్ల సమతుల్యతతో పాటు, రక్తపోటును కూడా అదుపులోకి తీసుకురావచ్చు.
అలాగే, అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ హెడ్ డాక్టర్ కిన్నెర పుత్రేవు ఒక ముఖ్యమైన హెచ్చరికను చేశారు. అధిక రక్తపోటుతో పాటు... కారణం లేకుండా బరువు పెరగడం, తీవ్రమైన అలసట, మలబద్ధకం, జుట్టు రాలడం లేదా చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే... వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
మరి దీనికి పరిష్కారం ఏమిటి?
సరైన మందులతో పాటు, కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు ఈ సమస్యను దూరం చేస్తాయి:
పోషకాలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
ఒత్తిడిని తగ్గించుకుని, సరైన నిద్రపోవడం.
క్రమంతప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం.