Weight-Loss Drugs Help Fight Cancer: బరువు తగ్గే మందులతో క్యాన్సర్‌కు చెక్.? ఎంతవరకు నిజం.?
ఎంతవరకు నిజం.?
Weight-Loss Drugs Help Fight Cancer: బరువు తగ్గడానికి, అలాగే మధుమేహం నియంత్రణకు వాడే మందులు.. ఇప్పుడు ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారిపై కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయా? అవుననే అంటున్నాయి తాజా అంతర్జాతీయ అధ్యయనాలు. స్థూలకాయం, డయాబెటిస్ చికిత్సలో వాడే సెమాగ్లుటైడ్, లిరాగ్లుటైడ్ వంటి 'జీఎల్పీ-1' (GLP-1) మందులు.. పలురకాల క్యాన్సర్ల నుంచి కూడా మానవ శరీరానికి రక్షణ కల్పిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ వార్షిక సమావేశంలో సమర్పించిన పరిశోధనా పత్రాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఈ జీఎల్పీ-1 మందులను క్రమం తప్పకుండా వాడుతున్న వారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గడమే కాకుండా.. ఒకవేళ ఇప్పటికే క్యాన్సర్ ఉన్న బాధితుల్లో జబ్బు మరింత ముదరకుండా నెమ్మదిస్తున్నట్లు తేలింది. అంతేకాదు, వీరు క్యాన్సర్ చికిత్సలకు బాగా స్పందిస్తూ.. మరింత ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
అయితే, ఈ జీఎల్పీ మందులు క్యాన్సర్ కణాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయనేది ఇంకా పూర్తిగా బయటపడలేదు. కానీ.. శరీరంలో వచ్చే దీర్ఘకాలిక వాపు ప్రక్రియను తగ్గించడం, ఇన్సులిన్ సంకేత వ్యవస్థను నియంత్రించడం మరియు కణితుల (Tumors) ఎదుగుదలను నేరుగా అడ్డుకోవడం ద్వారా ఇవి పనిచేస్తుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిజానికి చాలా రకాల క్యాన్సర్లు పుట్టడానికి, అవి వేగంగా పెరగడానికి శరీరంలోని 'దీర్ఘకాలిక వాపు' (Chronic Inflammation) ప్రధాన కారణం.
లిరాగ్లుటైడ్, టిర్జెపటైడ్, సెమాగ్లుటైడ్ వంటి మందుల వల్ల.. ఊపిరితిత్తి, రొమ్ము, పెద్దపేగు, కాలేయ క్యాన్సర్లు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం.. ఏకంగా 38 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గుతున్నట్లు ఒక అధ్యయనంలో రుజువైంది. సాధారణంగా ఊబకాయం లేదా ఓవర్ వెయిట్ అనేది క్యాన్సర్‌కు ఒక ప్రధాన ముప్పు. ఈ నేపథ్యంలో.. బరువును తగ్గించే ఈ జీఎల్పీ-1 మందుల యొక్క వాపు నివారణ గుణాలు.. అసలు క్యాన్సర్ రాకుండానే అడ్డుకుంటున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే, ఇవన్నీ కేవలం పరిశీలనాత్మక అధ్యయనాలు మాత్రమేనని.. సదరు వ్యక్తుల ఆరోగ్యం, వారు తీసుకుంటున్న ఇతర చికిత్సల ప్రభావం కూడా ఇందులో ఉండొచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా.. భవిష్యత్తులో క్యాన్సర్ నివారణకు ఈ మందులు ఒక సరికొత్త ఆయుధంగా మారే అవకాశం ఉందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.